
నిర్మల్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిందని, విద్యార్థులు మేధస్సుకు పదును పెడితే మరిన్ని విజయాలు సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొ న్నారు. సోమవారం నిర్మల్‌లోని సెయింట్ థామస్స్కూల్ లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌ను అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు టీచర్లు కృషి చేయాలన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలతోనే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. విద్యార్థుల ఆలోచనలకు పదునుపెడితే అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. మూప పద్ధతిలో విద్యాబోధనను పక్కకు పెట్టాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన సాగాలన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైన్స్ఫెయిర్ల ద్వారా చాలా మంది బాల శాస్త్రవేత్తలు వెలుగులోకి వచ్చారన్నారు. విద్యార్థుల ఆవిష్కరణలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణమన్నారు. ‘మన ఊరు.. మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయన్నారు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్మల్‌లో నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చదువు, క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ఇక్కడి విజ్ఞానాన్ని ఇక్కడే ఉపయోగించాలి...
విద్యార్థులు ఇక్కడి విజ్ఞానాన్ని ఇక్కడే ఉపయోగిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన చెప్పారు. రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో ఆమె మాట్లాడారు. టీచర్లు పిల్లలకు విజ్ఞానంతో పాటు మానవత్వాన్ని కూడా నేర్పాలన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారారని, మునుముందు అది ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, లైబ్రరీ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, సారంగాపూర్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, బాసర ట్రిపుల్ ఐటీ వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకుంటున్న ఎగ్జిబిట్లు..
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ లో వివిధ జిల్లాల విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు ఆకట్టుకుంటున్నాయి. మొదటి రోజు గద్వాల జిల్లా విద్యార్థులు తయారు చేసిన సోలార్ సైకిల్ హైలెట్‌గా నిలిచింది.