భవిష్యత్తు బీసీలదే..దేశవ్యాప్త కులగణనతో నవ శకం: ఫడ్నవీస్‌‌‌‌

భవిష్యత్తు బీసీలదే..దేశవ్యాప్త కులగణనతో నవ శకం: ఫడ్నవీస్‌‌‌‌
  • దేశవ్యాప్త కులగణనతో నవ శకం: ఫడ్నవీస్‌‌‌‌
  • దేశం మొత్తం బీసీల వైపు చూస్తున్నది: ప్రమోద్ సావంత్ 
  • మా వాటా మాకు దక్కే దాకా పోరాటం: జాజుల  
  • గోవాలో జాతీయ ఓబీసీ మహాసభ 

హైదరాబాద్, వెలుగు: బీసీలు కోరుకున్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటే కులగణన చేపట్టనుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. దేశవ్యాప్త కులగణనతో బీసీలకు నవ శకం వస్తుందని, ఇక భవిష్యత్తు అంతా బీసీలదే అని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన గురువారం గోవాలో 10వ జాతీయ ఓబీసీ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘ఓబీసీలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర కేబినెట్‌‌‌‌లో 27 మంది బీసీలకు ప్రధాని మోదీ అవకాశం కల్పించారు. బీసీలకు ఇంకా అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉంది.

బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను” అని తెలిపారు. ప్రతిఏటా జాతీయ స్థాయిలో ఓబీసీ మహాసభ నిర్వహించడం అభినందనీయమన్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. బీసీలంతా ఐక్యంగా ఉండి, తమ వాటాను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు దేశమంతా బీసీల వైపే చూస్తున్నదని అన్నారు. తమ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తున్నదని, కేబినెట్‌‌‌‌లో ముగ్గురు బీసీలకు అవకాశం కల్పించామని చెప్పారు.

బీసీల విషయంలో కేంద్రం సానుకూలంగా ఉన్నదని, అందుకే దేశవ్యాప్తంగా కులగణన చేపడ్తున్నదని పేర్కొన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీలు పోరాటం చేస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ఇది వంద శాతం బీసీల విజయమని పేర్కొన్నారు. ‘‘దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి వివరాలు వెల్లడించాలి. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. మా వాటా మాకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని అన్నారు.  

బీసీ ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు: మాణిక్‌‌‌‌రావు 

దేశవ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని ఆ పార్టీ గోవా ఇన్‌‌‌‌చార్జ్ మాణిక్‌‌‌‌రావు థాక్రే తెలిపారు. దేశంలో ఎవరి వాటా వారికి దక్కాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతమని చెప్పారు. ‘‘రాహుల్ ఆదేశాలతో తెలంగాణలో విజయవంతంగా కులగణన పూర్తి చేశాం. కేంద్రం దాన్ని మోడల్‌‌‌‌గా తీసుకుని దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. దేశ సంపద అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ జరిగితేనే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది” అని అన్నారు.

బీసీల డిమాండ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి, కేంద్రానికి సిఫార్సులు చేస్తున్నామని నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌‌‌‌రాజ్‌‌‌‌ గంగారాం తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేండ్లయినా బీసీలకు అన్ని రంగాల్లో సరైన వాటా దక్కలేదని రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ బబన్‌‌‌‌రావు తైవాడే ఆవేదన వ్యక్తం చేశారు. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మహాసభలో 12 తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. వీటిని రాష్ట్రపతి, ప్రధానికి అందజేస్తామని నేతలు తెలిపారు. సభకు 18 రాష్ర్టాల నుంచి ఓబీసీ నేతలు హాజరయ్యారు.