ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
పాపన్నపేట/చిలప్​చెడ్, వెలుగు: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి ప్రభుత్వం తరఫున దుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి  గోకుల్​షెడ్ లో ప్రతిష్ఠించారు. తొలి రోజు అమ్మవారు శైలపుత్రిదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం పూజారుల వేద మంత్రోచ్ఛరణల మధ్య ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి,  ఆలయ కమిటీ చైర్మన్​ బాలగౌడ్ , ఆలయ కమిటీ డైరెక్టర్లు  అమ్మవారికి పూజలు చేశారు.  ఆలయ ఈవో   శ్రీనివాస్, రైతు సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్​ సోములు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, తదితరులు  పాల్గొన్నారు.

చాముండేశ్వరిదేవికి మహాభిషేకం
చిలప్ చెడ్ మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది తీరాన కొలువైన చాముండేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆలయ పూజారులు అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించారు. నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం ఉమ్మడి మెదక్​  జిల్లాతో పాటు, 
హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర  నుంచి  భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.  
వర్గల్​ విద్యాధరి ఆలయంలో..
సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి ఆలయంలో  దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.    పూజారులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారు బాల త్రిపుర సుందరిగా  దర్శనమిచ్చారు.  

సమస్యలు స్పీడ్​గా పరిష్కరించేందుకే ప్రజావాణి
సంగారెడ్డి టౌన్/ మెదక్​టౌన్​, వెలుగు:  ప్రజా సమస్యలు స్పీడ్​గా పరిష్కరించేందుకే  ‘ప్రజావాణి’ నిర్వహిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్​గ్రీవెన్స్​హాల్లో నిర్వహించిన ప్రజావాణికి హాజరైన కలెక్టర్​ బాధితుల నుంచి అర్జీలు  తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  అర్జీదారుల సమస్యలను పెండింగ్​పెట్టకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. భూ సమస్యలు, ‘డబుల్’ ఇండ్లతో పాటు  వివిధ సమస్యలపై 45 ఆర్జీ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అడిషనల్​కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

 మెదక్​లో.. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్​ 
పెట్టొద్దని మెదక్​ అడిషనల్​ కలెక్టర్ రమేశ్​ఆఫీసర్లకు సూచించారు. సోమవారం   ప్రజావాణిలో ప్రజల నుంచి 40 అర్జీలను స్వీకరించామని తెలిపారు. డీఆర్​డీవో శ్రీనివాస్​, ఆర్డీవోలు సాయిరామ్​,  వెంకట ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.

సర్పంచ్​ కారు, ట్రాక్టర్​ను  తగలబెట్టిన దుండగులు
దుబ్బాక, వెలుగు: మిరుదొడ్డి మండలం.. అక్బర్​పేట గ్రామంలో సర్పంచ్​కారు, ట్రాక్టర్​కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు.  పోలీసుల వివరాల ప్రకారం.. సర్పంచ్​ ధర్మారం స్వరూప బుచ్చయ్య ఎప్పటిలాగే తన కారు, ట్రాక్టర్​ను ఇంటి ముందు పార్కింగ్​ చేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో  పెద్ద శబ్ధాలు వినిపించడంతో చుట్టుపక్కల వాళ్లు బయటకు వచ్చి చూడగా  కారు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కారు, ట్రాక్టర్​ కాలి బూడిదయ్యాయి. కావాలని ఎవరో వ్యక్తులు తన వెహికల్స్​కు నిప్పంటించారని సర్పంచ్​ వాపోయారు. కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు భూంపల్లి పోలీసులు తెలిపారు. 

తెలంగాణ సంస్కృతికి చిహ్నం ‘బతుకమ్మ’
అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్​

మెదక్​ టౌన్, వెలుగు : తెలంగాణ సంస్కృతికి ‘బతుకమ్మ’ చిహ్నమని అడిషనల్​ కలెక్టర్  ప్రతిమా సింగ్ అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం  డీఆర్​డీవో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ  ఉత్సవాలు నిర్వహించారు. మరో అడిషనల్​ కలెక్టర్ రమేశ్​తో కలిసి  హాజరైన ప్రతిమాసింగ్ మహిళా ఎంప్లాయీస్​తో కలసి బతుకమ్మ ఆడారు. వుమెన్​అండ్​చైల్డ్​వెల్ఫేర్​ఆఫీసర్​ బ్రహ్మాజీ, మెప్మా ప్రాజెక్ట్  డైరెక్టర్ ఇందిర, డీఆర్​డీవో శ్రీనివాస్​, బతుకమ్మ సమన్వయాధికారి రాజిరెడ్డి  పాల్గొన్నారు.

కాలపరిమితి ముగిసిన జీవోలను సవరించాలి
సంగారెడ్డి టౌన్/ మెదక్​టౌన్, వెలుగు:  రాజ్యాంగం 73 షెడ్యూల్డ్​ ఎంప్లాయ్​మెంట్​లో ఐదేళ్ల కోసారైనా  కనీస వేతనాల జీవోలను సవరించాల్సి ఉంటుందని,  రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సవరణ జరగలేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్ ఆరోపించారు. సోమవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, వైద్య ఖర్చుల దృష్ట్యా కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్​మేనేజ్​మెంట్లకు భయపడి సీఎం జీవోలు సవరణ చేయకపోవడం సరైంది కాదన్నారు. అనంతరం కలెక్టరేట్  ఏవో స్వర్ణలత కు వినతి పత్రం అందజేశారు. లీడర్లు జి సాయిలు, రాజయ్య , బాగా రెడ్డి , రాజి రెడ్డి, ప్రసన్న రావు తదితరులు పాల్గొన్నారు. మెదక్​లో..రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు జీవోలను సవరించకుండా కార్మికులకు తీవ్ర నష్టం చేస్తోందని సీఐటీయూ స్టేట్​ వైస్​ ప్రెసిడెంట్​ మల్లికార్జున్  విమర్శించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం మెదక్​ కలెక్ట ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​కు వినతిపత్రం అందచేశారు.  

డబుల్​ రోడ్డు వేయాలని ధర్నా
జిన్నారం, వెలుగు:  జిన్నారం మండలం సోలక్ పల్లి నుంచి కంజర్ల వరకు డబుల్​రోడ్డు వేయాలని  బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం సోలక్ పల్లిలో  బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా లో ఆయన పాల్గొని మాట్లాడారు. డబుల్​రోడ్డు లేక బాగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని వాపోయారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. శ్రీకాంత్ గౌడ్, రాజిరెడ్డి, దాది శ్రీనివాస్, జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పేదలకు భూమి పంచిన ఘనత కాంగ్రెస్ దే
దామోదర్​ రాజనర్సింహ

మెదక్​ (రేగోడ్), వెలుగు: నిరుపేదలకు భూపంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వానిదేనని మాజీ డిఫ్యూటీ సీఎం, కాంగ్రెస్​పార్టీ ఎలక్షన్​ కమిటీ చైర్మెన్​ దామోదర్​ రాజనర్సింహ అన్నారు. రేగోడ్​ మండలం గజ్వాడ గ్రామంలో పీఏసీఎస్​ డైరెక్టర్ బాలకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ సంగారెడ్డితోపాటు, శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులకు కండువా కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో కల్వకుంట కుటుంబం రాజ్యమేలుతోందని,  రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ మెంబర్ మున్నూరు కిషన్ తదితరులు పాల్గొన్నారు.


గజ్వేల్​ ప్రైవేట్ ​ఆస్పత్రుల్లో తనిఖీలు
గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా గజ్వేల్  పట్టణంలోని పలు ప్రైవేట్​ హాస్పిటల్స్​లో సోమవారం వైద్యాధికారులు  తనిఖీలు  నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్​వో శ్రీధర్ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం పట్టణంలోని 13 హాస్పిటల్స్ లో  తనిఖీలు  చేశారు. రూల్స్​కు విరుద్ధంగా నడుస్తున్న 5 హాస్పిటళ్లకు రూ.25 వేల చొప్పున రూ.1.25 లక్షల జరిమానా విధించారు. మరి కొన్ని ఆస్పత్రులకు  షోకాజ్​ నోటీసులు ఇచ్చినట్లు డీఎంహెచ్​వో తెలిపారు.

ఎమ్మెల్యే క్రాంతికి నిరసన సెగ
 గొంగ్లూర్​లో ‘దళితబంధు’ ఇవ్వాలని అడ్డుకున్న గ్రామస్తులు
సమస్యలు పరిష్కరించాలని లక్ష్మీసాగర్​లో  నిలదీత 

సంగారెడ్డి, వెలుగు : ఆందోల్ ఎమ్మెల్యే  చంటి క్రాంతి కిరణ్​కు తన నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. దళితబంధు ఇవ్వాలని  గొంగ్లూర్​లో దళితులు అడ్డుకోగా, లక్ష్మీసాగర్​ గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు నిలదీశారు.  సోమవారం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ బతుకమ్మ చీరలు, పింఛన్​కార్డులు పంచేందుకు లక్ష్మీసాగర్​గ్రామంలోకి వెళ్లగానే..    అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మీటింగ్​జరిగేలా చూశారు. అనంతరం ఎమ్మెల్యే కారు వెంట పరుగులు పెడుతూ డౌన్​.. డౌన్​... అంటూ నినదించారు.  గొంగ్లూర్​లో ..లక్ష్మీసాగర్​ నుంచి నేరుగా గొంగ్లూర్​ గ్రామానికి వెళ్లగా అక్కడ దళిత బంధు లబ్ధిదారుల నుంచి నిరసన తప్పలేదు. ‘ఎవరి పేర్లను ఎంపిక చేశారు’..‘ఎవరికి యూనిట్లు ఇచ్చారు’ అని ప్రశ్నించారు. పోలీసులు వారించే ప్రయత్నం చేయగా వారితో కాసేపు వాగ్వాదం జరిగింది.  ఈ క్రమంలో ఎమ్మెల్యే క్రాంతి పోలీసుల రక్షణలో అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.  

ఏడుపాయల బోనాల  పోస్టర్​ రిలీజ్:ఎమ్మెల్సీ కవిత 
హాజరవుతారని ఎమ్మెల్యే వెల్లడి

మెదక్​, వెలుగు: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 1న ఏడుపాయలలో నిర్వహించే బోనాల పండుగకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చీఫ్​ గెస్ట్​గా హాజరవుతారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు.  సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​ లో బతుకమ్మ పండుగ వాల్ పోస్టర్ ను జడ్పీ వైస్​ చైర్ పర్సన్​ లావణ్య, మున్సిపల్​చైర్మన్ చంద్రపాల్ తో కలిసి రిలీజ్​ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో పుట్టిన పూలపండుగను నేడు 64 ప్రపంచదేశాల్లో జరుపుకుంటుండడం గొప్ప విషయమన్నారు. ఈ నెల 30న మెదక్​ గవర్నమెంట్​బాయ్స్​ కాలేజీలో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని, అందరూ పాల్గొని సక్సెస్​చేయాలని పిలుపునిచ్చారు.  

తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి:అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​​
మెదక్​ టౌన్​, వెలుగు : తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపై ఉందని మెదక్​  అడిషనల్​ కలెక్టర్ రమేశ్​సూచించారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వయో వృద్ధుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రజావాణి హాల్​లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను డీడబ్ల్యూవో బ్రహ్మాజీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్ రమేశ్​మాట్లాడుతూ ఎవరైనా తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించినా,  పోషణ బాధ్యతలు విస్మరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటామని అందరి చేత  ప్రతిజ్ఞ చేయించారు.  డీఆర్డీవో శ్రీనివాస్,  అధికారులు శ్యామ్​, రవీందర్​ తదితరులు పాల్గొన్నారు. 

పోరాట ప్రతీక ఐలమ్మ యాదిలో..
తెలంగాణ ఉద్యమ పోరాట ప్రతీక చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. అధికార యంత్రాంగం, పార్టీలు, కులసంఘాలు, ప్రజా సంఘాల లీడర్లు ఐలమ్మ విగ్రహాలకు, ఫొటోలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రజాకార్ల , దేశ్​ముఖ్​ల దౌర్జన్యాలపై తిరగబడి భూ పోరాటానికి నాంది పలికిన ధీరవనిత ఐలమ్మ అని కొనియాడారు.  ఐలమ్మ స్ఫూర్తితో యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు.  - నెట్​వర్క్​, వెలుగు