యాదాద్రి క్షేత్రంలో భక్తుల ఇక్కట్లు

యాదాద్రి క్షేత్రంలో  భక్తుల ఇక్కట్లు

యాదాద్రి భువనగిరి జిల్లా : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. చుట్టుపక్క ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. ఆలయ ప్రాంగణంలోనే కాదు.. పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 7 గంటల సమయంలో ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి 1గంట సమయం పట్టింది. భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో దర్శనాలకు పట్టే సమయం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రసాదం కౌంటర్ల దగ్గర గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అనూహ్యంగా తరలివచ్చిన భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూ ప్రసాదాలు లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. గంటల తరబడి వేచి ఉన్నాక అయిపోయాయని.. లడ్డు సరఫరా లేదని చెప్పడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ అధికారులపై మండిపడ్డారు. 

కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఏళ్ల తరబడి నవీకరించిన ఆలయానికి దర్శనం కోసం కొండంత ఆశతో వస్తే..ఇక్కడ ఏర్పాట్లు దారుణంగా ఉన్నాయని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ తగిన ఏర్పాట్లు లేక అసౌకర్యంగా ఇబ్బందులు పడుతున్నామని..కుటుంబ సమేతంగా ముఖ్యంగా వృద్ధులు, పిల్లలతో వచ్చిన వారు చాలా ఇబ్బందిపడుతున్నామని చెప్పారు. భక్తులను ఎక్కడికక్కడ దోపిడీకి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.