అయోధ్య బాల రాముడికి తొలిరోజు రూ.3.17 కోట్ల విరాళాలు

  అయోధ్య బాల రాముడికి  తొలిరోజు రూ.3.17 కోట్ల విరాళాలు

అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడ్ని చూసేందుకు దేశ నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.  ఆలయం ప్రారంభమైన తొలి రోజు దాదాపుగా 5 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకోగా..   రెండో రోజు  దాదాపు 2.5 లక్షల మంది భక్తులు దర్శనానికి తరలివచ్చినట్లుగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. రాములోరి దర్శనం కోసం  వచ్చిన భక్తులు భారీగా  విరాళాలు సమర్పించారు. తొలి రోజున భక్తులు రూ.3.17 కోట్ల విరాళాలు సమర్పించినట్లు ట్రస్ట్ వెల్లడించింది.  ప్రాణ ప్రతిష్ఠ తరువాత ఆలయంలో పది  హుండీలను ఏర్పాటు చేశామని తెలిపింది.  

రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ అనిల్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ఆలయానికి అత్యధిక విరాళాలు అందాయని... ఆన్‌లైన్‌లో విరాళాలు అందించడానికి రామభక్తులు ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నారు.  విరాళాల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, పలువురు భక్తులు విరాళాలు అందించారని  చెప్పారు.  బాలక్‌ రాముని దర్శనాలు ప్రారంభమై నేటికి (గురువారం) మూడో రోజు కావడం విశేషం.  

మరోవైపు అయోధ్య రాముడి దర్శనాన్ని పొడిగిస్తూ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది.  భక్తులు ఉదయం 7 గంటల నుంచి 11 : 30 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు.  ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి   రాత్రి 10:00 గంటల వరకు రామ్ లల్లా దర్శనం చేసుకోవచ్చు. అంతకుముందు రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఉండేది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది ఆలయ పాలక విభాగం.