యాదగిరిగుట్టలో పైన ఎండ..కింద మంట

యాదగిరిగుట్టలో పైన ఎండ..కింద మంట

యాదగిరిగుట్ట, వెలుగు :  ఎండలు మండుతుండడంతో నరసింహస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు తిప్పలు పడుతున్నారు. సరిపోనన్ని చలువపందిళ్లు లేక నీడ కోసం పరుగులు తీస్తున్నారు. ఎండాకాలం ఆరంభంలోనే సూర్యుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తులు విలవిలలాడుతున్నారు. ఎండల తీవ్రత తగ్గించేందుకు కొండపైన కొన్నిచోట్ల మాత్రమే చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఎక్కువగా తిరిగే ప్రధానాలయ ప్రాంగణం, లిఫ్ట్ ఏరియా, ఉత్తర, తూర్పు రాజగోపుర ప్రాంతాల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేయలేదు. అలాగే దర్శనం తర్వాత ప్రధానాలయం నుంచి శివాలయం, లడ్డూప్రసాద కౌంటర్ల వద్దకు వెళ్లే మార్గంలోనూ చలువ పందిళ్లు లేవు. ఆలయ పునర్నిర్మాణంలో ప్రధానాలయం సహా ప్రధానాలయ ప్రాంగణాన్ని కూడా కృష్ణశిల రాతిబండలతో తీర్చిదిద్దారు. ఎండలకు ఈ రాతిబండలు వేడెక్కి భక్తుల కాళ్లు కమిలిపోతున్నాయి. పైనుంచి ఎండ, కింది నుండి రాతిబండల వేడిసెగలకు తట్టుకోలేకపోతున్నారు. భక్తులు నడిచేందుకు  గతేడాది లిఫ్ట్ ఏరియా నుంచి తూర్పు రాజగోపురం వరకు ఆలయ ప్రాంగణ రాతిబండలపై రెండు గజాల వెడల్పుతో కూల్ పెయింట్ చేశారు. కానీ వీకెండ్స్ లో రద్దీ విపరీతంగా పెరుగుతుండడంతో కూల్ పెయింట్ ఏరియా నుంచి కాకుండా పక్కనుంచి నడవాల్సి వస్తోంది. దీంతో కాళ్లు కాలి బొబ్బలు వస్తున్నాయి. ఎండవేడిని తట్టుకోలేని మహిళా భక్తులు.. నెత్తిపై చున్నీలు, చీర కొంగు కప్పుకుని ఉపశమనం పొందాల్సి వస్తోంది. ఇక చంటిపిల్లలతో వచ్చే భక్తుల అవస్థలు వర్ణణాతీతం.  

ఆమ్దానీ పెరుగుతున్నా...

పునర్నిర్మాణం తర్వాత ప్రధానాలయం రీ ఓపెన్ అయినప్పటి నుంచి భక్తుల సంఖ్య పెరగడమే కాకుండా ఆలయ ఆదాయం కూడా అదేస్థాయిలో ఉంటోంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి పూజల ధరలు పెంచడమే కాకుండా కొత్త పూజలను ప్రవేశపెట్టారు. వీఐపీ టికెట్ దర్శనాలు, బ్రేక్ దర్శనాల పేరుతో ఆమ్దానీ పెంచుకోవడానికి కొత్త మార్గాలను ఎంచుకున్నారు. కానీ, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి పట్టించుకోవడం లేదు.  

గుట్టలో ఫుల్ రష్

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సండే హాలీడే కావడంతో.. రాష్ట్ర నలుమూలల నుంచి యాదగిరిగుట్టకు తండోపతండాలుగా తరలివచ్చారు. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నర  పట్టింది. వాహనాలతో పార్కింగ్ ప్లేస్ నిండిపోవడంతో.. కొండపైకి వెళ్లే రోడ్డులో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. వీఐపీ టికెట్లతో 2600 మంది, బ్రేక్ దర్శనాల ద్వారా 1376 మంది స్వామివారిని దర్శించుకున్నారు.  పలు రకాల పూజలు, నిత్య  కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.54,66,013 ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.21,25,600, ప్రధాన బుకింగ్ తో రూ.6,80,750, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6 లక్షలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.4,12,800, వీఐపీ దర్శన టికెట్ల విక్రయం ద్వారా రూ.3.90 లక్షలు, సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణతో రూ.2.04 లక్షలు, సువర్ణపుష్పార్చన ద్వారా రూ.2,09,096, కల్యాణకట్ట ద్వారా రూ.1.61 లక్షలు, అన్నదానం విరాళాలతో రూ.1,60,252 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.

చలువ పందిళ్లు వేయాలి 

కొండపైన సరిపడా చలువ పందిళ్లు లేవు. ఎండలకు తట్టుకోలేకపోతున్నాం. దర్శనం తర్వాత ఆలయ పరిసరాల్లో సేద తీరలేకపోతున్నాం. ఎండల నుంచి రక్షించుకోవడానికి ఆలయ మాడవీధుల్లో తప్ప ఎక్కడా చోటు లేదు. కొండపైన భక్తులు తిరిగే ప్రతిచోట చలువ పందిళ్లు వేయాలి. ముఖ్యంగా ప్రధానాలయ ప్రాంగణం, ఆలయ సముదాయ నలుదిక్కులా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
- ఎల్లయ్య, భక్తుడు, నల్గొండ

సౌకర్యాలు లేవు 

యాదగిరిగుట్ట టెంపుల్ రీఓపెన్ అయి ఏడాది దాటుతున్నా సౌకర్యాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. ఆలయ ఆదాయం పెరుగుతున్నా సదుపాయాలు ఎందుకు కల్పిస్తలేరో అర్థం కావడం లేదు. ఈ ఎండాకాలం చంటిపిల్లలతో వచ్చినోళ్లు బాగా ఇబ్బందులు పడుతున్నరు.  
- విజయ్, భక్తుడు , హైదరాబాద్