కోల్ బెల్ట్, వెలుగు : భక్తుల ఆరాధ్య దేవతలు సమ్మక్క– సారలమ్మ గద్దెలపై కొలుదీరడంతో శుక్రవారం భక్తులు పోటెత్తారు. మంచిర్యాల గోదావరి తీరం, సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ ఆర్కే–1ఏ గని సమీప పాలవాగు తీరం, శ్రీరాంపూర్ సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద సమ్మక్క– సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గద్దెల మీద ఆసీనులైన తల్లులను దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలిరావడంతో దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. మొదట గోదావరి నది, సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన షవర్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు.
చిన్నారుల తలనీలాలు అప్పగించారు. కోరికలను తీర్చి ఇంటిల్లిపాదిని చల్లగా చూడాలంటూ.. భక్తులు కుటుంబ సమేతంగా బంగారం (బెల్లం) నెత్తినపెట్టుకుని ఒడి బియ్యం, సారేలను గద్దెల వద్ద సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్నలకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులు అక్కడే సహపంక్తి భోజనాలు వండుకుని తిన్నారు. జాతరలో మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, ఏస్వోటు జీఎం జీఎల్ప్రసాద్, డీజీఎం (పర్సనల్) సీహెచ్అశోక్, రాజకీయ, కార్మిక సంఘాల లీడర్లు పాల్గొన్నారు.
