వన దేవతల దర్శనానికి తరలివచ్చిన భక్తులు.. 2 లక్షల మంది రాక

వన దేవతల దర్శనానికి తరలివచ్చిన భక్తులు.. 2 లక్షల మంది రాక

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతల దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా మేడారం చేరుకున్న భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేశారు. జంపన్న వాగు ఒడ్డున ఉన్న కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. గద్దెల వద్ద నిలువెత్తు బంగారం( బెల్లం) పసుపు, కుంకుమ, పూలు, చీర, సారె, గాజులు చెల్లించారు.

గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం వన దేవతలకు మొక్కులు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కోళ్లు, మేకలను బలి ఇచ్చారు. భక్తుల రద్దీతో అధికారులు ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులను క్యూ లైన్ లో పంపి గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా  చూశారు. రెండు లక్షల మందికి పైగా భక్తులు  దర్శనం
చేసుకున్నారని అధికారులు తెలిపారు.