యాదాద్రిలో కిక్కిరిసిన భక్తులు..రికార్డు స్థాయిలో ఆదాయం

యాదాద్రిలో కిక్కిరిసిన భక్తులు..రికార్డు స్థాయిలో ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలి రావడంతో ఆదాయం పెరిగింది. ఆదివారం ఒక్కరోజే ఆదాయం కోటి రూపాయలు దాటింది. ఇంత ఆదాయం రావడం ఇది రెండోసారి అని ఆలయ అధికారులు తెలిపారు. 

యాదాద్రిలో సండే సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శించుకున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడితో ఆహ్లాద వాతావరణం నెలకొంది.  భక్తులకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లుగా ఆలయ అధికారులు  వెల్లడించారు. 

స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలతోపాటు అభిషేకాలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రతాల దగ్గర కూడా భక్తులు కిక్కిరిసిపోయారు.   స్వామివారి స్వాతి నక్షత్రం పురస్కరించుకొని  ఆలయ అర్చకులు శతఘటాభిషేకం నిర్వహించారు.

కొండకింద అనుబంధ ఆలయం శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడ భక్తులు సందర్శించి.. ఆలయ నిత్యపూజలలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు