ధర్మ దర్శనానికి 5 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటల టైం

ధర్మ దర్శనానికి 5 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటల టైం
  • రేపు చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేత
  • కార్తీక దీపారాధనకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట, వెలుగు :యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి ఆదివారం ‘కార్తీక శోభ’ సంతరించుకుంది. కార్తీక మాసానికితోడు ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. దీంతో ఉదయం నుంచి రాత్రి దాకా కొండపై ఎక్కడ చూసిన భక్తుల సందడి కనిపించింది. స్వామివారి ధర్మ దర్శనానికి 5 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటలకు పైగా టైం పట్టింది. కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. కార్తీక పౌర్ణమి రోజున (మంగళవారం) చంద్ర గ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తున్నారు. దీంతో భక్తులు ఆదివారం భారీ ఎత్తున తరలివచ్చారు. ఆదివారం 1,349 మంది దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. కొండపై ఉన్న పర్వత వర్థనీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు రుద్రాభిషేకాలు, లక్ష బిళ్వార్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక దీపారాధనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

రికార్డు స్థాయిలో ఆదాయం
యాదగిరిగుట్ట దేవస్థానానికి ఆదివారం ఒక్కరోజే రూ.85,62,851 ఆదాయం వచ్చింది. నరసింహ స్వామి ఆలయ చరిత్రలో ఇదే ఒక్కరోజు అత్యధిక ఆదాయమని ఆలయ ఈవో గీతారెడ్డి చెప్పారు. కార్తీక మాసానికి తోడు ఆదివారం హాలిడే కావడంతో.. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చినట్టు తెలిపారు. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.29,76,700 ఆదాయం సమకూరింది. కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.7.50 లక్షలు, వీఐపీ దర్శన టికెట్ల విక్రయంతో రూ.17.10 లక్షలు, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ.10,79,200, బ్రేక్ దర్శనాలతో రూ.4,64,700, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,12,200, ప్రచార శాఖ ద్వారా రూ.2,04,500, పాతగుట్ట ఆలయం ద్వారా రూ.2,74,060 ఇన్ కమ్ వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.

భక్తులకు తప్పని తిప్పలు
కొండపైకి రాకపోకలు సాగించేందుకు ఒకటే ఘాట్ రోడ్డు ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం ఎగ్జిట్ ఘాట్ రోడ్డు ఏరియాలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పార్కింగ్ ఏరియా నిండిపోవడంతో.. పాత గోశాల, రింగు రోడ్డుపైనే వెహికల్స్​ నిలిపివేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి బస్సులు ఆగే ప్లేస్​కు వచ్చేందుకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఎంట్రీ ఘాట్ రోడ్డు రిపేర్ లో ఉండడంతో.. కొండపైకి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ఎగ్జిట్ ఘాట్ రోడ్డునే వాడుతున్నారు. ట్రాఫిక్​ క్లియర్​ చేసేందుకు పోలీసులు నానా పాట్లు పడాల్సి వచ్చింది.