శిలా తోరణం వరకు క్యూ లైన్..శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఇబ్బందులు

శిలా తోరణం వరకు క్యూ లైన్..శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఇబ్బందులు

తిరుమలకు భక్తుల పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా స్వామి వారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 30గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టమెంట్‌లు నిండిపోయాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు శిలా తోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.  రద్దీ నేపథ్యంలో టీటీడీ అధికారులు భక్తులకు పలు సూచనలు చేశారు. రూ.300 ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు ఉన్నవారు మాత్రమే తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు. 

మరోవైపు భక్తులు భారీగా తరలిరావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనంతో పాటు భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు తాగునీటిని శ్రీవారి సేవకులు అందిస్తున్నారు. వీరితో పాటు ఆరోగ్య, విజిలెన్స్‌ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నాయి.ఏప్రిల్ 8వ తేదీ శనివారం సాయంత్రం 5గంటల వరకు దాదాపు 50వేల మంది భక్తులు  శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది.