శ్రీశైలంలో ఎలుగుబంటి హల్​చల్.. భయాందోళనలో భక్తులు

శ్రీశైలంలో ఎలుగుబంటి హల్​చల్.. భయాందోళనలో భక్తులు

ఏపీలోని దేవాలయ దర్శనాలకు వస్తున్న ప్రజలకు వన్యమృగాలు తారసపడుతుంటం భయాందోళనలు సృష్టిస్తోంది. ఇటీవల తిరుమలలో ఓ పులి చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేసిన ఘటన మరవక ముందే శ్రీశైలంలో ఓ ఎలుగు బంటి సంచరిస్తోందనే వార్త భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. 

ఆగస్టు 13న రాత్రి శ్రీశైలం మల్లికార్జున స్వామి శిఖర దర్శనానికి వచ్చిన కొంత మంది భక్తులకు మెట్ల మార్గంలో ఎలుగుబంటి కనిపించింది. దానిని చూసిన పలువురు తమ ఫోన్లతో వీడియోలు తీశారు. మూడు రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని వారు ఆరోపిస్తున్నారు. 

భల్లూకం భయంతో రాత్రుళ్లు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయభ్రాంతులకు లోనవుతున్నారు. దానిని బంధించి భక్తులకు భద్రత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.