
అచ్చంపేట, వెలుగు : నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన లొద్ది మల్లయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. బల్మూరు మండలంలోని లొద్ది మల్లయ్య క్షేత్రానికి బాణాల, మన్ననూరు నుంచి కాలినడకన వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తొలి ఏకాదశి రోజే ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉండడంతో భక్తులు లొద్దికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.
కానీ, స్థానికులకు మాత్రమే అవకాశం కల్పిస్తామని అధికారులు ప్రకటించడంతో, అచ్చంపేట నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన భక్తులే వచ్చారు. లొద్ది మల్లయ్య క్షేత్ర పరిసరాల్లో వన్యప్రాణుల సంతతి పెరగడం, జులై నెల జంతువుల పునరుత్పత్తి సమయం కావడంతో అటవీ అధికారులు గత కొన్నేండ్లుగా ఆంక్షలు విధిస్తున్నారు. -