మేడారంలో ఉప్పొంగిన భక్తి భావం

మేడారంలో ఉప్పొంగిన భక్తి భావం

జయశంకర్ ‌‌భూపాలపల్లి, వెలుగు: మినీ మేడారం జాతరకు భక్తులు క్యూ కడుతున్నారు. రెండో రోజైన గురువారం భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. మండమెలిగే పండుగ సందర్భంగా మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తల్లులను చూసి పులకించిపోయారు. గద్దెల ముందు పొర్లు దండాలు పెట్టారు. సారె చీరలు, బంగారం(బెల్లం) సమర్పించారు. గొర్రె, మేకపోతులు, కోడిపుంజులను బలిచ్చి, విందు చేసుకొన్నారు. మన రాష్ట్రం నుంచే కాక చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చారు. ఇదిలా ఉండగా.. మేడారంలో నెట్ ‌‌ ‌‌వర్క్ ‌‌ పనిచేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఊరూరా తల్లులకు మొక్కులు

వరంగల్, వెలుగు: మినీ మేడారం జాతర మొదలైన నేపథ్యంలో ఇంటింటా సమ్మక్క, సారలమ్మ మొక్కులు మొదలయ్యాయి. పెద్ద జాతరకు వెళ్లొచ్చిన భక్తులు, మినీ మేడారం పేరుతో తిరిగి ఇళ్లల్లో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మేడారంలో మండమెలిగే పండుగ మొదలుకావడంతో ఊర్లలో తల్లులకు పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. బంధువులు, చుట్టుపక్కల వారిని పిలుచుకొని ఇంట్లోనే సమ్మక్క పండుగ చేసుకుంటున్నారు. కాగా, వ్యాపారులు కిలో కోడి, బెల్లంపై రూ.30 నుంచి రూ.50 వరకు ధరలు పెంచారు.