- గ్రీవెన్స్ డేలో దేవులపల్లి గ్రామస్తుల ఆవేదన
- డబుల్ఇండ్లు, భూ సమస్యలే అధికం..
- సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారుల ఆదేశాలు
సంగారెడ్డి టౌన్, వెలుగు: వివిధ ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం కోసం ఇప్పటికే రెండుసార్లు తమ భూములు ఇచ్చామని, ట్రిపుల్ఆర్ కోసం మరోసారి భూసేకరణ చేస్తే తాము రోడ్డుపాలు అవుతామని దేవులపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో గ్రీవెన్స్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవులపల్లి గ్రామంలో భూసేకరణ తీరుపై కలెక్టర్ శరత్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటికే కాళేశ్వరం కాలువ, మరో ఉప కాలువ నిర్మాణానికి భూములు కోల్పోయామని, ఇప్పుడు మళ్లీ రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో గ్రామంలోని భూములన్నీ సేకరిస్తే తమ పరిస్థితి ఏమిటని మొరపెట్టుకున్నారు. గ్రామంలో 846 ఎకరాలకు 480 ఎకరాల భూములు కోల్పోతున్నామని నోటీసులు ఇవ్వకుండా, గ్రామసభ నిర్వహించకుండా భూసేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారమైనా చెల్లించాలి లేదా భూమికి భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ రాజర్షి షా అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు.
- ఎల్లాపూర్ జిబ్లాక్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టా భూముల రిజిస్ట్రేషన్ లు ఓపెన్ చేయాలని అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
- అందోల్ మండలం డాకూర్ గ్రామంలో నిర్మించిన 104 డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై ఎంక్వైరీ చేయాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
మెదక్‌లో 24 ఫిర్యాదులు
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీదారుల నుంచి 24 ఫిర్యాదులు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దన్నారు. మొత్తం 24 వినతుల్లో 8 డబుల్ బెడ్రూంలు ఇవ్వాలని, భూసమస్యలు, ఆసరా పింఛన్లపై16 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజావాణిలో జిల్లా ఉన్నతాధికారులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు
మెదక్ టౌన్, వెలుగు : పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా తెలుసుకొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంబంధిత ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు.
