ఫైర్ అలారం స్విచ్చాఫ్​ చేస్తే నేరం చేసినట్లే

ఫైర్ అలారం స్విచ్చాఫ్​ చేస్తే నేరం చేసినట్లే

మాదాపూర్​, వెలుగు : ప్రతి హాస్పిటల్​లో ఫైర్​ సేఫ్టీ పాటించాలని  రాష్ట్ర ఫైర్​ సర్వీసెస్​ డీజీ నాగిరెడ్డి సూచించారు. అగ్నిప్రమాదాల నివారణపై అందరికీ అవగాహన ఉంటే ప్రమాదం జరిగినప్పుడు ఇతరులను కాపాడొచ్చని పేర్కొన్నారు. ఫైర్​ అలారం స్విచ్చాఫ్​ చేస్తే నేరం చేసినట్లేనని ఆయన తెలిపారు.  ఫైర్ ​సర్వీస్ వీక్(అగ్ని మాపక దళ వారోత్సవాలు)​లో భాగంగా బుధవారం హైటెక్ ​సిటీలోని యశోద హాస్పిటల్​లో  ‘ఫైర్​ సేఫ్టీ ఇన్ హాస్పిటల్స్’ పై వర్క్​షాప్  నిర్వహించారు.

చీఫ్ గెస్టుగా హాజరైన డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. హాస్పిటల్స్​లో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఫైర్ ​సేఫ్టీపై నర్సులు, డాక్టర్లు శిక్షణ  తీసుకోవాలన్నారు. హాస్పిటళ్లలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఫైర్ సేఫ్టీపై అవగాహన ఉండాలన్నారు. పేషెంట్లకు ట్రీట్​మెంట్​ఇవ్వడంతో పాటు అగ్నిప్రమాదం జరిగితే వారిని కాపాడే బాధ్యత కూడా డాక్టర్లు తీసుకోవాలని కోరారు. హాస్పిటల్​ బిల్డింగ్​కు అనుమతులు ఇచ్చే సమయంలో ఓపెన్​ విండోస్​ పెట్టాలని తాము చెబుతున్నామన్నారు. ‘ఇటీవల సికింద్రాబాద్ స్వప్న లోక్​ కాంప్లెక్స్​లో ఫైర్​ యాక్సిడెంట్​ జరిగింది.అక్కడ ఎమర్జెన్సీ మెట్లు ఉన్నా లాక్​ చేసి ఉంచారు. ఫైర్​ సేఫ్టీ ఎక్విప్ మెంట్, పంపు ఉన్నా పనిచేయలేదు. రెగ్యులర్ మెయింటెనెన్స్ లేదు.

ఫైర్ అలారం ఎన్నిసార్లు మోగినా అన్ని సార్లు చెక్​ చేసుకోవాలి తప్ప ఫాల్స్ అలారం వస్తున్నదని ఆఫ్​ చేయొద్దు’ అని  నాగిరెడ్డి వివరించారు. బిల్డింగ్​లలో చాలా ప్రమాదాలు ఎలక్ట్రికల్ షార్ట్ ​సర్క్యూట్  వల్లే జరుగుతాయని, ప్రతి  పదేండ్లకు ఒకసారి బిల్డింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్  మార్చుకుంటే ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ఫైర్ సేఫ్టీపై అవగాహన ఉన్న వాళ్లు హైదరాబాద్​లో చాలా తక్కువ మంది ఉన్నారని, అందుకోసం ఫైర్​ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో  నెల, మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. ఈ వర్క్​షాప్​లో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్​, ఏడీ నారాయణరావు, రీజినల్​ఫైర్ ఆఫీసర్ పాపయ్య, యశోద హాస్పిటల్ మెడికల్​ డైరెక్టర్​ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.