న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గుర్రుగా ఉంది. ఇండిగో విమాన సేవల్లో అంతరాయంపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన డీజీసీఏ బుధవారం (డిసెంబర్ 10) ఇండిగో ఎయిర్ లైన్స్ సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు సమన్లు జారీ చేసింది. ఇండిగో సంక్షోభానికి సంబంధించిన పూర్తి వివరాలతో గురువారం (డిసెంబర్ 11) మధ్యాహ్నం 3 గంటలకు సమీక్ష సమావేశానికి హాజరు కావాలని ఆదేశించింది.
ఇండిగో సంక్షోభం బుధవారం (డిసెంబర్ 10) కూడా కొనసాగింది. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. చెన్నై విమానాశ్రయంలో 70, శంషాబాద్ ఎయిర్ పోర్టులో 33 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ముందస్తు సమాచారం కూడా లేకుండా ఉన్నపళంగా విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇండిగో తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం సీరియస్ కావడంతో విమాన కార్యాకాలాపాలను పునరుద్ధరించేందుకు ఇండిగో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొన్ని రూట్లలో ఇండిగో విమాన కార్యకాలాపాలు సాధారణ స్థితికి వచ్చాయి.
డీజీసీఏ కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్‌డీటీఎల్) నిబంధనలు 2025, నవంబర్ నుంచి అమలులోకి రావడంతో, పైలట్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఒక పైలెట్ రోజులో రాత్రి 12 నుంచి ఉదయం 6 మధ్య రెండు ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి. వారంలో కనీసం 36 గంటలు రెస్ట్ ఇవ్వాలి. నైట్ డ్యూటీ తరువాత 12 గంటల విరామం తప్పనిసరి. పైలెట్లతో పాటు ఇతర సిబ్బంది సంఖ్య కూడా తగ్గింది. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, సాఫ్ట్‌వేర్ లోపం వల్ల కూడా అంతరాయాలు ఏర్పడినట్లు ఇండిగో పేర్కొంది. చలి కాలం రావడం, ప్రతికూల వాతావరణం, రద్దీ వల్ల కూడా విమానాలను రీషెడ్యూల్ చేయాల్సి వచ్చిందని తెలిపింది.
ఈ క్రమంలో ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థ అంతర్గత రోస్టరింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని స్పష్టం చేసింది. ఇండిగో సంస్థకు ఇప్పటికే డీజీసీఏ నోటీసులు ఇచ్చిందని.. ఈ సమస్యపై విచారణకు ఆదేశించామని తెలిపింది. చట్ట ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని.. ప్రయాణికులు ఇబ్బంది పడితే యాజమాన్యాలే బాధ్యత వహించాలని కేంద్రం ఖరాకండిగా చెప్పింది.

