
- సమస్యలపై పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశం
హైదరాబాద్,వెలుగు: పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డీజీపీ జితేందర్ అన్నారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ. శివధర్ రెడ్డి, అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్ సహా పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, వెల్ఫేర్ లైసెన్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు నల్ల శంకర్ రెడ్డి, రాచకొండ అధ్యక్షుడు సిహెచ్ భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్‌లో ఉన్న సరెండర్లు, టీఏలు, మెడికల్ బిల్స్, జీపీఎఫ్‌లు, హోంగార్డులకు కారుణ్య నియామకాలు, ఆరోగ్య భద్రత సహా మొత్తం 12 సమస్యలను పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గం దృష్టికి తీసుకెళ్లింది. డీజీపీ మాట్లాడుతూ.. సిబ్బందికి అనుకూల వాతావరణం కల్పించడం, సంక్షేమ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో అమలు చేయడంతో పాటు పదోన్నతులు, ఇతర పరిపాలన అంశాలను పరిష్కరిస్తామన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది పనిచేసే యూనిట్ కేంద్రాలలో వైద్య సిబ్బంది సదుపాయాలను కల్పించాలన్నారు.
శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్ భగవత్, పర్సనల్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మెడికల్ క్యాంపులను విస్తృత స్థాయిలో నిర్వహించి సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. మెడికల్ ఇన్వాల్యుడేషన్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారుల సమస్యల పరిష్కారంపై డీజీపీ, ఇతర పోలీసు అధికారులు తమకు హామీ ఇచ్చారని వివరించారు. తమ సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.