కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ఆదుకుంటం.. నిజామాబాద్లో ఇంటికి వెళ్లి ఓదార్చిన డీజీపీ శివధరెడ్డి

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ఆదుకుంటం.. నిజామాబాద్లో ఇంటికి వెళ్లి ఓదార్చిన డీజీపీ శివధరెడ్డి

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​లో రౌడీ రియాజ్ చేతిలో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్​కుమార్ కుటుంబాన్ని ఆదుకుంటామని డీజీపీ శివధర్​ రెడ్డి తెలిపారు. మంగళవారం నిజామాబాద్​లోని ప్రమోద్​ ఇంటికి డీజీపీ వెళ్లి ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం సీపీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. ప్రమోద్​కుమార్ పోలీస్ శాఖలో చేరినప్పటి నుంచి చాలా చురుగ్గా పనిచేసేవాడని డీజీపీ అన్నారు

రియాజ్ దాడిలో ఆయన మృతిచెందడం విచారకరమన్నారు. భార్య, ముగ్గురు చిన్న పిల్లలున్న ప్రమోద్ కుటుంబానికి పోలీస్ శాఖ తరఫున అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషి యాగా ప్రకటించిందన్నారు. 300 గజాల ఇంటి స్థలం ఇస్తామని, చనిపోయిన ప్రమోద్ ఇన్ సర్వీస్​లో పొందే జీతభత్యాలను రిటైర్మెంట్ వయస్సు వరకు కుటుంబానికి అందించడంతోపాటు ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. పోలీస్ భద్రత, బీమా తదితర బెనిఫిట్స్ అన్నీ అందేలా చూస్తామన్నారు.

డీఎస్పీతో విచారణ 

రియాజ్ ఎన్​కౌంటర్​పై నిజామాబాద్ జిల్లాతో సంబంధంలేని డీఎస్పీతో విచారణ చేయిస్తామని శివధర్​రెడ్డి తెలిపారు. ఘటనపై జుడిషల్ ఎంక్వైరీ కూడా జరుగుతున్నందున రియాజ్​పై ఎన్ని రౌండ్ల కాల్పులు జరిపింది చెప్పడానికి వీలులేదన్నారు. కాగా రియాజ్ ను పట్టుకునే క్రమంలో గాయపడ్డ సయ్యద్‌ ఆసిఫ్‌ను హైదరాబాద్ అబిడ్స్‌లోని గ్రీన్‌ఫీల్డ్‌ మల్లారెడ్డి హాస్పిటల్​లో డీజీపీ శివధర్‌ రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరామర్శించారు.  రియాజ్ ఆచూకీ తెలిపినందుకు ఆసీఫ్​ భార్యకు రూ.50 వేల నగదు పురస్కారం అందించారు.