- మూడు చెరువులకే పరిమితమైన డీజీపీఎస్ సర్వే
- సర్వే చేసి, హద్దులు తేలిస్తేనే ఆగనున్న కబ్జాలు
- రెవెన్యూ రికార్డులకు, వాస్తవ పరిస్థితులకు భారీ తేడా
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలోని చారిత్రక గొలుసుకట్టు చెరువుల కబ్జాలను విడిపిస్తామన్న అధికారుల మాటలు ఆచరణకు నోచుకోలేదు. మొత్తం 12 చెరువులకు గాను కేవలం మూడు చెరువులకు డీజీపీఎస్ సర్వే చేసి మిగిలిన చెరువులను వదిలేయడంతో ఎప్పటిలాగే ఆక్రమణలకు గురవుతున్నాయి. నిమ్మనాయుడు కాలంలో నిర్మించిన ఈ గొలుసుకట్టు చెరువులతో నిర్మల్ పరిసర ప్రాంతాల్లో తాగు, సాగునీటి అవసరాలు తీరడమే కాకుండా, పట్టణంలో వరదలు రాకుండా ఉండేవి. అయితే ఈ చెరువులపై అక్రమార్కుల కన్ను పడడంతో క్రమంగా కబ్జాలకు గురువుతున్నాయి.
ఈక్రమంలో హైకోర్టు ఆదేశాలతో చెరువు భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడేందుకు సంబంధిత అధికారులు డీజీపీఎస్(డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) సర్వే చేపట్టారు. ఈ డీజీపీఎస్ పరికరం శాటిలైట్ తో అనుసంధానమై భూముల హద్దులను పక్కాగా నిర్ధారిస్తుంది. సర్వే ఆధారంగా చెరువులకు సంబంధించిన శిఖం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ భూములకు రక్షణ ఏర్పడుతుందని ప్రకటించారు. సర్వేతో రెవెన్యూ రికార్డులకు, వాస్తవ పరిస్థితులకు భారీ తేడా కనిపిస్తోంది.
డీజీపీఎస్ సర్వేకు బ్రేక్..
నిర్మల్లో మొత్తం 12 గొలుసుకట్టు చెరువులు ఉండగా, మూడు చెరువు భూములకు సంబంధించిన సర్వే చేశారు. ప్రస్తుతం ఉన్న రికార్డులు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా డీజీపీఎస్ లో చెరువు భూముల హద్దులను శాటిలైట్ సహకారంతో నిర్ధారించింది. సర్వే నివేదికలు అధికారికం కానున్నాయని, ఈ నివేదికల ఆధారంగా ఇప్పటి వరకు భూమి హద్దులపై ఉన్న సందేహాలు, అభ్యంతరాలు తొలగిపోతాయని ఆఫీసర్లు స్పష్టం చేశారు. వివాదాలకు సైతం పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
మొదటగా నిర్మల్ లోని కంచరోని చెరువు, కుర్రన్నపేట చెరువు, ధర్మసాగర్ చెరువుల విస్తీర్ణాన్ని డీజీపీఎస్ తో సర్వే చేసి హద్దులను నిర్ధారించారు. ఆక్రమణకు గురైన భూములను సైతం గుర్తించి హద్దుల ఆధారంగా ట్రెంచ్ లను ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో మిగిలిన గొలుసుకట్టు చెరువుల విస్తీర్ణాలను కూడా డీజీపీఎస్ తో సర్వే చేసి హద్దులను నిర్ధారించి, కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామని అప్పట్లో ప్రకటించారు.
రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో పాటు కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగింది. ఈ సర్వేను కేవలం మూడు చెరువులకే పరిమితం చేసి మిగిలిన 9 చెరువుల సర్వే చేపట్టకపోవడంతో కబ్జాదారులకు వరంగా మారుతోంది. సాంకేతికంగా చెరువు భూముల హద్దులను గుర్తించకపోవడంతో శిఖం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ భూముల ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. కబ్జాల కారణంగా నిర్మల్ లోని గొలుసుకట్టు చెరువుల రూపురేఖలు అదృశ్యం అవుతున్నాయనే విమర్శలున్నాయి.
గత వైభవం వచ్చేనా?
నిమ్మనాయుడు కాలంలో ఈ చారిత్రక గొలుసుకట్టు చెరువులను బహుళ ప్రయోజనాల కోసం నిర్మించారు. నిర్మల్ పట్టణం చుట్టూ ఉన్న ఈ చెరువులు క్రమంగా కబ్జాలకు గురవుతున్నాయి. పలుకుబడి, పరపతి గల వ్యక్తులు ఈ చెరువు భూములను ఆక్రమించి భారీ నిర్మాణాలు చేపట్టారు. మరికొంత మంది రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై నిర్మల్ కు చెందిన సీనియర్ న్యాయవాది అంజుకుమార్ రెడ్డి కొద్ది రోజుల కింద హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై హైకోర్టు స్పందించి చెరువు భూములను సర్వే చేసి ఆ భూములను రక్షించాలని కలెక్టర్ ను ఆదేశించింది.
దీంతో అప్పటి కలెక్టర్ గొలుసుకట్టు చెరువు భూముల సర్వేకు డీజీపీఎస్ పరికరాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే కంచెరోని చెరువు, కురన్నపేట్ చెరువు, ధర్మసాగర్ చెరువు భూముల సర్వే పూర్తయింది. ఖజానా చెరువు, బంగల్ పేట చెరువు, పల్లె చెరువు, మంజులాపూర్, రాంసాగర్, సీతాసాగర్, మంజులాపూర్ చెరువు, పల్లె చెరువు, ఇబ్రహీం తలాబ్ భూములను సర్వే చేయకపోవడం కబ్జాదారులకు వరంగా మారింది. మళ్లీ డీజీపీఎస్సర్వే చేపట్టి చెరువు భూముల వాస్తవ విస్తీర్ణం నిర్ధారించి భూములను కబ్జాల నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
అక్కడ నిర్మాణాలకు నో చాన్స్!
చెరువుల శిఖంతో పాటు ఎఫ్టీఎల్ ను గుర్తించిన అధికారులు ఎఫ్టీఎల్ నుంచి 90 అడుగుల వరకు బఫర్ జోన్ గా నిర్ధారించారు. బఫర్ జోన్ వరకు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదనే నిబంధన ఉంది. బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు, రియల్ వెంచర్ల కు ఇరిగేషన్ శాఖ ఎన్ఓసీలు జారీ చేయకూడదు. అలాగే మున్సిపల్ ఆఫీసర్లు నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయవద్దనే నిబంధనలు విధించారు. చెరువుల డీజీపీఎస్ సర్వే ద్వారా హద్దుల నిర్ధారణ జరిగితే ఇక ఆక్రమణలకు అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నారు.
గొలుసుకట్టు చెరువుల లెక్క ఇదీ..
చెరువు విస్తీర్ణం(ఎకరాల్లో..)
బంగల్ పేట 210.32
ఖజానా చెరువు 98.22
కొత్తచెరువు 33.11
రామ్ సాగర్ 37.23
జాపూర్ కురన్నపేట 76.18
సీతాసాగర్ 48.11
ఇబ్రహీం చెరువు 76.18
కంచరోని చెరువు 74.19
ధర్మసాగర్ చెరువు 65.10
మోతీ తలాబ్ 132.06
చిన్న చెరువు 81.34

