ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ల వైఫల్యంపై డీహెచ్‌

ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ల వైఫల్యంపై డీహెచ్‌
  • డాక్టర్‌‌, స్టాఫ్‌ను ప్రశ్నించిన కమిటీ
  • ఆపరేషన్ థియేటర్‌‌ పరిశీలన
  • మృతుల్లో ముగ్గురికి కిడ్నీ ఫెయిల్యూర్​
  • పోస్టుమార్టంలో గుర్తించిన డాక్టర్లు

హైదరాబాద్‌, ఎల్బీనగర్, వెలుగు: ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ల ఫెయిల్యూర్ ఘటనలో స్టెరిలైజేషన్‌లోనే ఏదో పొరపాటు జరిగిందని, మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌, డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఆగస్టు 25న డీపీఎల్ ఆపరేషన్లు జరిగిన ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌ను శ్రీనివాసరావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ శుక్రవారం సందర్శించింది. ఆపరేషన్లు జరిగిన థియేటర్‌‌, అక్కడ ఉన్న పరికరాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. డీపీఎల్ క్యాంపు డ్యూటీలో ఉన్న సుమారు 30 మంది స్టాఫ్‌ను కమిటీ ప్రశ్నించింది. ఆ రోజు ఏం జరిగిందో వివరాలు సేకరించింది. తర్వాత అక్కడే డీహెచ్ మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆయన అన్నారు. స్టెఫలో కోకస్ బ్యాక్టీరియా వల్లే మృతులంతా ఇన్ఫెక్షన్​కు గురయినట్టు గుర్తించామని తెలిపారు.శనివారం నాటికి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. అయితే, ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలో సర్జరీలకు వినియోగించిన పరికరాలతోనే, ఆ తర్వాత రోజు చేవెళ్లలో 60 మందికి, 27న సూర్యాపేటలో వంద మందికి డీపీఎల్ సర్జరీలు చేశారని డీహెచ్ తెలిపారు. వాళ్లలో ఎవరికీ ఏమీ కాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ల సమయంలో వాడిన కాటన్‌‌‌‌, బ్యాండేజ్, ప్యాడ్స్‌‌‌‌ స్టెరిలైజేషన్‌‌‌‌లో ఏమైనా పొరపాటు జరిగిందేమోనన్న అనుమానాన్ని డీహెచ్ వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

విడివిడిగా విచారణ

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో డీపీఎల్ సర్జరీలు చేసిన డాక్టర్ జోయల్‌‌‌‌, ఆయన టీమ్‌‌‌‌ను శుక్రవారం సాయంత్రం తన ఆఫీసులో డీహెచ్‌‌‌‌ కమిటీ విచారించింది. డాక్టర్‌‌‌‌‌‌‌‌ను, టీమ్‌‌‌‌ను వేర్వేరుగా ప్రశ్నించారు. ఆపరేషన్ల కోసం తామే 3 సెట్ల ఎక్విప్‌‌‌‌మెంట్ తీసుకొచ్చామని, వాటి స్టెరిలైజేషన్​లో తాము పొరపాట్లు చేయలేదని టీమ్ సభ్యులు డీహెచ్‌‌‌‌కు చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత వరసగా రెండ్రోజులు జరిగిన క్యాంపుల్లోనూ ఇవే ఎక్విప్‌‌‌‌మెంట్స్‌‌‌‌ను వినియోగించి డీపీఎల్ సర్జరీలు చేశామని, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్ జోయల్‌‌‌‌ డీహెచ్‌‌‌‌కు వివరించినట్టు తెలిసింది. ఒకవేళ తమ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఏదైనా తేడా ఉంటే, చేవెళ్ల, సూర్యాపేటలో సర్జరీ చేయించుకున్న మహిళలకు సైతం ఇబ్బందులు తలెత్తేవని జోయల్ తన వాదన వినిపించినట్టు సమాచారం.

ఇన్ఫెక్షన్​తో అవయవాలు దెబ్బతిని..

డీపీఎల్‌‌‌‌ సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ బారిన పడి మరణించిన నలుగురిలో ముగ్గురికి కిడ్నీలు ఫెయిల్ అయినట్టు పోస్ట్‌‌‌‌మార్టమ్‌‌‌‌లో తేలింది. మృతులు మౌనిక, సుష్మ, లావణ్యకు కిడ్నీలు ఫెయిలైనట్టు   రిపోర్ట్‌‌‌‌లో పేర్కొన్నారు. మౌనికకు కిడ్నీ ఫెయిల్ అవడం, ఆ తర్వాత క్రమంగా అవయవాలన్నీ పాడవడంతో ఆమె కార్డియాక్ అరెస్ట్‌‌‌‌కు గురయి చనిపోయినట్టు గుర్తించారు. సెప్టిక్ షాక్ వల్ల లావణ్యకు కిడ్నీలు సహా అవయవాలన్నీ దెబ్బతిన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. ఆగస్ట్‌‌‌‌ 28న చనిపోయిన సుష్మ సైతం కిడ్నీ ఇన్ఫెక్షన్‌‌‌‌కు గురయిందని పేర్కొన్నారు. క్రమంగా ఆమె అవయవాలన్నీ దెబ్బతిని కార్డియాక్ అరెస్ట్‌‌‌‌తో చనిపోయిందని డాక్టర్లు రిపోర్ట్‌‌‌‌ ఇచ్చారు. వీళ్లందరికీ స్టెఫిలో కోకస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారు. పూర్తిగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్లే ఇలా జరిగిందా, ఇంకేదైనా కారణం ఉందా అనేది కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ వచ్చాక తేలుతుందని అధికారులు చెబుతున్నారు.   

ఉస్మానియాలో పట్టించుకోలె: మృతుల కుటుంబ సభ్యులు

ఇబ్రహీంపట్నం ఘటనలో మృతి చెందిన నలుగురు మహిళల్లో, ఇద్దరు మహిళలు తొలుత ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌లో చేరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉన్నారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడం, ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయడంలో ఆలస్యం చేస్తుండడంతో కుటుంబ సభ్యులు వారిని అక్కడి నుంచి ఓ ప్రైవేటు హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. డీహెచ్ నేతృత్వంలోని ఎంక్వైరీ కమిటీకి ఈ విషయాన్ని తెలియజేశామని మృతుల కుటుంబ సభ్యులు వెల్లడించారు.