
భద్రాచలం, వెలుగు : రామ భక్తురాలు దమ్మక్క సేవా యాత్రను సీతారామచంద్రస్వామి దేవస్థానం గురువారం వైభవంగా నిర్వహించారు. దమ్మక్క చిత్రపటంతో గర్భగుడిలో కేశవనామార్చన చేసి, శేషవస్త్రాలు, శేషమాలికలు, ప్రసాదంను అందజేశారు. తర్వాత భద్రగిరి ప్రదక్షిణగా రెండు సార్లు ఆలయం చుట్టూ తిరిగి మూడోసారి భద్రాచలం పట్టణంలో శోభాయాత్రను చేపట్టారు. టూరిజం హోటల్ వద్ద దమ్మక్క విగ్రహానికి పూలమాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నేతలు పూనెం వీరభద్రం, కృష్ణదొర దేవస్థానం అధికారుల తీరును నిరసించారు.
ఏటా ఆదివాసీలతో ఘనంగా నిర్వహించే అధికారులు ఈసారి తమను విస్మరించారంటూ ఆరోపించారు. ఆలయానికి యాత్ర చేరుకున్నాక బేడా మండపంలో ఆదివాసీల సమక్షంలో సీతారామచంద్రస్వామికి అడవి పండ్లు, ఫలాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీలను సత్కరించి ప్రసాదాలు అందజేశారు.