ధరణి పెండింగ్ దరఖాస్తులకు మోక్షం.. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 6,751 అప్లికేషన్లు పెండింగ్

ధరణి పెండింగ్ దరఖాస్తులకు మోక్షం.. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 6,751 అప్లికేషన్లు పెండింగ్
  • నెలాఖరులోగా పరిష్కరించాలని సర్కారు ఆదేశం
  • కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లకు అధికారాలు 
  • ఫీల్డ్ వెరిఫికేషన్, మాన్యువల్ రిపోర్టులు కంప్లీట్ 
  • వారం రోజుల్లో క్లియర్ చేస్తామంటున్న అధికారులు

మంచిర్యాల, వెలుగు: ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. కొన్నేండ్లుగా పెండింగ్​లో ఉన్న అప్లికేషన్లను ఈ నెలాఖరులోగా డిస్పోజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు వారం రోజులుగా పెండింగ్ ఫైళ్ల దుమ్ము దులుపుతున్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో ధరణి దరఖాస్తులను పట్టించుకోకపోవడంతో ప్రజలు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి వేసారిపోయారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చి 1నుంచి 9వరకు ధరణి దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అనంతరం 17 వరకు గడువు పొడిగించింది. ఈలోగా లోక్​సభ ఎలక్షన్స్ రావడంతో స్పెషల్ డ్రైవ్​కు బ్రేక్ పడింది. రెవెన్యూ అధికారులు ఎన్నికల పనుల్లో బిజీ అయ్యారు. ఈ నెల 13న పోలింగ్ ముగియడంతో ప్రభుత్వం తిరిగి ధరణి సమస్యలపై దృష్టి పెట్టింది. ఈ నెలాఖరులోగా పెండింగ్ ఫైళ్లను డిస్పోజ్ చేయాలని ఆదేశించింది.

ఇప్పుడు ఆర్డీవోలు, తహసీల్దార్లకు కూడా.. 

గతంలో ధరణి సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్లకు మాత్రమే ఉండేది. వేల సంఖ్యలో ఫైళ్లు పేరుకుపోవడంతో మార్చిలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్​లో ప్రభుత్వం కలెక్టర్ తో పాటు ఆర్డీవోలు, తహసీల్దార్లకు సైతం అధికారాలు ఇచ్చింది. మ్యుటేషన్, సక్సెషన్, పీవోబీ సమస్యలు, సెమీ అర్బన్ ఏరియాల్లో పట్టాదారు పాస్​బుక్​ల సమస్యలు, కోర్టు తీర్పుల ఆధారంగా పాస్​బుక్​ల జారీతోపాటు ఇండ్లు, నివాస స్థలాలుగా మారిన భూముల నాలా కన్వర్షన్ వంటి అధికారాలను కలెక్టర్​కు ఇచ్చారు. 

ఆర్డీవోలకు పాస్​బుక్ లేకుండా నాలా కన్వర్షన్, ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు, ఎన్నారైలకు సంబంధించిన సమస్యలు, కోర్టు కేసుల పరిష్కారం, డేటా కరెక్షన్స్, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు తదితర సమస్యలను పరిష్కరించే అధికారం ఇచ్చారు. అలాగే పట్టా, అసైన్డ్ భూముల విరాసత్, జీపీఏ, స్పెషల్ ల్యాండ్ మ్యాటర్స్, ఖాతా మెర్జింగ్ వంటి సమస్యలను క్లియర్ చేయడానికి తహసీల్దార్లకు పర్మిషన్ ఇచ్చారు. 

6,751 అప్లికేషన్లు పెండింగ్

మార్చిలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్​లో తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, గిర్దావర్ల ఆధ్వర్యంలో ప్రతి మండలానికి రెండు టీమ్​లను ఏర్పాటు చేశారు. ఒక మండలంలో 20 గ్రామాలు ఉంటే ఒక్కో టీమ్​కు10 గ్రామాలను కేటాయించారు. అయితే దరఖాస్తుల పరిశీలనతోనే గడువు ముగిసింది. అప్పుడు 7,250 అప్లికేషన్లు పెండింగ్ ఉండగా, ప్రస్తుతం 6,751 ఉన్నాయి. వీటికి సంబంధించిన రికార్డుల వెరిఫికేషన్ కోసం ఆర్డీవోలు, తహసీల్దార్ల లాగిన్​కు పంపించారు. కలెక్టర్ లెవల్లో పరిష్కరించాల్సిన పట్టాదారు పాస్​బుక్ డేటా కరెక్షన్స్ తహసీల్దార్ల దగ్గర 3,601, ఆర్డీవోల దగ్గర 66, నాలాకు సంబంధించిన 329 అప్లికేషన్లు తహసీల్దార్ల దగ్గర, 21 పిటిషన్లు ఆర్డీవోల దగ్గర పెండింగ్​లో ఉన్నాయి. 

అలాగే కలెక్టర్ లెవల్లో బ్లాక్​లిస్ట్, నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన 697, పెండింగ్ మ్యుటేషన్ 313, పాస్​బుక్ లేని సక్సెషన్స్ 690, కోర్టు కేసులు 57, మొత్తం 1,759 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఆర్డీవోల లెవల్లో కోర్టు కేసులు, ఇంటిమేషన్ 464, పాస్​బుక్ లేకుండా నాలా 18, ప్రభుత్వం సేకరించిన భూములకు సంబంధించి 87తో పాటు మొత్తం 576 ఫైళ్లు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. తహసీల్దార్ల లెవల్లో వివిధ సమస్యలకు సంబంధించిన 370 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఇంకా నాలుగు రోజులే గడువు ఉంది. ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత తహసీల్దార్ల బదిలీలు జరిగే అవకాశముండడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. 

వారం రోజుల్లో పరిష్కరిస్తాం..

మార్చిలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సందర్భంగా ధరణి పెండింగ్ దరఖాస్తుల రికార్డుల పరిశీలన, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేశాం. మాన్యువల్​గా చేయాల్సిన వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది. వాటిని ఇప్పుడు ఆన్​లైన్ చేస్తున్నాం. వారం రోజుల్లోగా పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆ తర్వాత వచ్చే అప్లికేషన్లకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.  - బదావత్ సంతోష్, కలెక్టర్

రెండేండ్ల నుంచి తిరుగుతున్నం... 

దండేపల్లి మండలం వెల్గనూర్ శివారులోని సర్వే నంబర్ 301ఇలో మా అమ్మ గడికొప్పుల లక్ష్మి పేరిట రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇది ఆన్​లైన్​లో నమోదు కాకపోవడంతో డిజిటల్ పాస్​బుక్ రాలేదు. ధరణి టీఎం 33 మాడ్యుల్లో మిస్సింగ్ సర్వే నంబర్ కింద 2022 జూలై 17న ఆన్​లైన్​లో దరఖాస్తు చేసినం. రెండేండ్లు కావస్తున్నా డిజిటల్ పాస్​బుక్ రాలేదు. దీంతో రైతుబంధు నష్టపోతున్నాం. క్రాప్​లోన్ తీసుకోలేకపోతున్నాం. - గడికొప్పుల మారుతి, వెల్గనూర్, దండేపల్లి