డెడ్​బాడీల మీద గాయాలు.. భువనగిరి స్టూడెంట్స్​ మరణాలపై వీడని సస్పెన్స్

డెడ్​బాడీల మీద గాయాలు.. భువనగిరి స్టూడెంట్స్​ మరణాలపై వీడని సస్పెన్స్

యాదాద్రి, వెలుగు : భువనగిరి ఎస్సీ హాస్టల్​లో ఇద్దరు టెన్త్​ స్టూడెంట్ల మరణంపై  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి బాడీలపై గాయాలున్నాయని కుటుంబసభ్యులు, స్టూడెంట్స్​ ఆరోపిస్తుండగా పోలీసులు  మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు.   ఈ నెల 3న రాత్రి  పదో తరగతి చదువుతున్న  కోడి భవ్వ, గాదె వైష్ణవి ఆత్మహత్య చేసుకోవడం  సంచలనం కలిగించింది.  ఈ  ఘటనపై రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించారు. మూడు రోజులైనా  ఘటనకు సంబంధించి పోలీసుల  నుంచి స్పష్టత రాకపోవడంతో  సోషల్​ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి.

హాస్టల్​ వార్డెన్​ శైలజ, ఆటో డ్రైవర్​ ఆంజనేయులు, మరో ఐదుగురిని  అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరగగా..  పోలీసులు  తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెబుతున్నారు.  బాడీల మీద గాయాలు ఏమీ లేవని అంటున్నారు. స్టూడెంట్స్​ రాసినట్టు చెప్తున్న  సూసైడ్​లెటర్​నిజమైనదేనా అన్న అనుమానాలు తలెత్తున్నాయి. లెటర్​లో ఉన్నది వారి చేతిరాత కాదని, పదో తరగతి చదువుతున్న వాళ్లు   రాసినట్టు  లేదని  స్టూడెంట్స్, ​ పేరెంట్స్ అభిప్రాయపడుతున్నారు.  హాస్టల్​ వార్డెన్​ శైలజను ఏమనవద్దని రాయడంపై  అనుమానాలు   వ్యక్తమవుతున్నాయి. ఈ లెటర్, స్టూడెంట్స్​  నోట్​బుక్స్​​ను ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపిస్తామని పోలీసులు చెప్పారు.  స్టూడెంట్స్​ ఆత్మహత్య చేసుకున్నారా ? వారిని ఎవరైన వేలాడదీశారా..? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.  ​ పేరెంట్స్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్​ 174 కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.  సాక్ష్యాల సేకరణ, పరిశీలన తర్వాత అనుమానితులను విచారిస్తామన్నారు.   
 

హాస్టల్​ ఖాళీ..

స్టూడెంట్స్​ మృతి చెందడంతో భయాందోళనకు గురైన  స్టూడెంట్స్​హాస్టల్​  ఖాళీ చేశారు. హాస్టల్​ సిబ్బంది పేరెంట్స్​కు సమాచారం అందించి  వారిని ఇండ్లకు పంపించేశారు. ఆత్మహత్య చేసుకున్న   స్టూడెంట్స్​  రూమ్​  సీజ్​ చేశారు.  జిల్లాలో 21 ఎస్సీ హాస్టల్స్​ఉండగా ..   సగం  హాస్టల్స్​లోనే రెగ్యులర్​ వార్డెన్లున్నారు. మిగతా చోట్ల ఇన్​చార్జిలతో నడిపిస్తున్నారు.  భువనగిరి హాస్టల్​ వార్డెన్​ శైలజ కూడా బీబీనగర్​, పోచంపల్లిలోని హాస్టల్స్​కు ఇన్​చార్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా పిల్లలపై వార్డెన్స్​ పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదని తెలుస్తోంది.