ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ధరణి పోర్టల్​ను ప్రక్షాళన చేయాలని బీజేపీ కిసాన్​ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి అన్నారు. ఆపార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ముట్టడి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. రాష్ర్ట ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీని అమలు చేయాలన్నారు. అందోళన నేపథ్యంలో కలెక్టరేట్​ ఎదుట పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. 

గేటు దూకి కలెక్టరేట్​లోకి చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నించిన నాయకులను, కార్యకర్తలను పోలీసులు నిలువరించేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం బీజేపీ నాయకులను ఆరెస్ట్​చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ రాష్ర్ట కార్యవర్గసభ్యుడు దొంగల సత్యనారాయణ, నున్నా రవి, రుద్ర ప్రదీప్​, శ్యాంరాథోడ్​, విజయరాజు, నాగేశ్వరరావు, సంతోష్​రెడ్డి, గెంటేల విద్యాసాగర్​ పాల్గొన్నారు. 

కొత్తగూడెంలో ..

భద్రాద్రికొత్తగూడెం: ధరణి పోర్టల్​ను సవరించడంతో పాటు రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్​ చేస్తూ జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని ధర్నా చౌక్​ వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యావతి, జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ మాట్లాడారు. 

ధరణితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ఊదరగొట్టే ఉపన్యాసాలు చేసిందని, రుణాల మాఫీలో టీఆర్​ఎస్​ సర్కార్​ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. టీఆర్​ఎస్​ గవర్నమెంట్​ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ ప్రోగ్రాంలో బీజేపీ నాయకులు ఆకుల నాగేశ్వరరావు గౌడ్​, ఎడ్లపల్లి శ్రీనివాస్​, సీతారాం నాయక్​, చిలుకూరి రమేష్​, పొలిశెట్టి వెంకటేశ్వర్లు, నాళ్ల సోమసుందర్​, నరేంద్రబాబు పాల్గొన్నారు. 

ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరించింది

నేలకొండపల్లి , వెలుగు : రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను, వారి కుటుంబాలను ప్రభుత్వం విస్మరించిందని తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య ఆరోపించారు. మంగళవారం నేలకొండపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు ఏర్పాటుకు అడ్డం పడ్డ వారికే కేసీఆర్ అవకాశాలిచ్చి, అసలైనవారిని అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. అమరుల ఆకాంక్షలు నెరవేర్చకుండా.. తెలంగాణను అప్పులపాలు చేశారని ఆరోపించారు. 

రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్న మేధావులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. రాష్ట్రంలో నియంతను మించిన పాలన చేస్తూ దశాబ్ధాల వెనకబాటు తనానికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం కార్పొరేషన్ఏర్పాటు చేయాలనే డిమాండే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కమిటీలు వేసి ఈ వేదికను పోరాట రూపానికి సమాయత్తం చేస్తున్నట్టు తెలిపారు.

జిల్లా నూతన కమిటీ ఎన్నిక : జిల్లా అధ్యక్షులు గా మాదాసి శ్రీనివాసరావు , ప్రధాన కార్యదర్శిగా మీసాల రామ్ చందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కోయ వెంకటనారాయణ, చిన్నం సంగయ్య, చావా రమేశ్​, షేక్ డాన్, షేక్ అఫ్జల్ మియా పాల్గొన్నారు. 

మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 26.94 కోట్లు

సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.26.94 కోట్ల నిధులు మంజూరు అయినట్టు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. మంగళవారం రాష్ట్ర మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నుంచి మంజూరు ఉత్తర్వులను ఎమ్మెల్యే సండ్ర, ఎంపీ వద్దిరాజు అందుకున్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్తుపల్లి నూతన మున్సిపల్ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు గతంలో మొదటి విడతగా రూ.3.06 కోట్లు మంజూరు చేయగా మిగిలిన వాటిని మంగళవారం విడుదల చేసనట్టు తెలిపారు. ఈ సందర్భంగా కే.టీ.ఆర్ కు, చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు ఎమ్మెల్యే సండ్ర, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. 

వ్యవసాయ కార్మిక సంఘం సభలను సక్సెస్ చేయండి

ఖమ్మం టౌన్,వెలుగు: ఈనెల 29 నుంచి పట్టణంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను సక్సెస్​ చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, వ్యవసాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, నున్నా నాగేశ్వరరావు, మెరుగు సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్ మీడియాతో మాట్లాడారు. ఈ బహిరంగ సభకు కేరళ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ వస్తున్నట్టు తెలిపారు. 

3వేల మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవాతు, 2 వేల మంది కళాకారుల కళ రూపాలు ంటాయని చెప్పారు. ఈ ప్రదర్శన లో మాజీ పార్లమెంటు సభ్యులు తమ్మినేని వీరభద్రం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ్ రాఘవన్, బి.వెంకట్ ఇతర లీడర్లు పాల్గొననున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంఉపాధి హామీ పథకంను నీరుగార్చుతోందన్నారు. వ్యవసాయ కూలీలు అడ్డా కూలీలుగా మారినట్లు చెప్పారు. స్టేట్ లో ఏ వన్ గ్రేడ్ ధాన్యం రూ.2080 ఉండగా,కేరళ రాష్ట్రంలో ఈధరకు అదనంగా రూ.8 వందల చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు రూ.32 లక్షల కోట్లను కార్పొరేట్లకు మాఫీ చేస్తే,పేద రైతులకు ఒక్క పైసా కూడా రద్దు చేయలేదన్నారు. సమావేశంలో పొన్నం వెంకటేశ్వర్లు, ఐవీరమణారావు పాల్గొన్నారు.

రాష్ట్రపతి రాక నేపథ్యంలో.. సరిహద్దులపై ఫుల్​నజర్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. చత్తీస్​ఘడ్, తెలంగాణ బార్డర్​లో భద్రాచలం డివిజన్లో రాష్ట్రపతి పర్యటించనున్న క్రమంలో ఇరు రాష్ట్రాల ప్రత్యేక పోలీస్​బలగాలు వారం రోజులుగా అటవీ ప్రాంతంలో మొహరించాయి. సరిహద్దుకు సమీపంలోనే ఇటీవలి ఎన్​కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంతో పోలీస్​లు మరింతగా అప్రమత్తమయ్యారు. రాష్ట్రపతి పర్యటించనున్న భద్రాచలం, సారపాక ప్రాంతాల్లో ఫుల్​ సెక్యురిటీ ఉంది. అనుమానితులను పోలీస్​లు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇంటిలిజెన్స్​, స్పెషల్​బ్రాంచ్​ పోలీస్​ నిఘా వర్గాలు గత రెండు రోజులుగా ఈ ప్రాంతాపై ఫోకస్​ చేశాయి. 

అడుగడుగునా నిఘా..

చత్తీస్​ఘడ్​, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఇటీవలికాలంలో తెలంగాణ పోలీస్​లు బేస్​ క్యాంప్​లు ఏర్పాటు చేశారు. వాటిని మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు ఉద్యమాలపై నిర్భంధం పెంచుతున్నారంటూ మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. సమాధాన్​ ఆపరేషన్​ రద్దు చేయాలని మావోయిస్టులు డిమాండ్​ చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో మావోయిస్టులు పీఎల్​జీఏ వారోత్సవాలను నిర్వహించారు. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి ఎంపిక నేపథ్యంలో మావోయిస్టులు సరిహద్దు అటవీ ప్రాంతంలో సమావేశాన్ని నిర్వహించారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో పోలీస్​లు పెద్ద ఎత్తున సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్​ను చేపడ్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్ల, మణుగూరు ప్రాంతాలతో పాటు, చత్తీస్​ఘడ్​, ఆంధ్రప్రదేశ్​, ఒడిశా రాష్ట్రాల నుంచి రాకపోకలను నియంత్రిస్తున్నారు. 

రాష్ట్ర పతి పర్యటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్​లతో పాటు రామగుండం, వరంగల్​ కమిషనరేట్ల పోలీస్​లు, జయశంయర్​భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీస్​లు బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రజాసంఘాల నాయకులతో పాటు నక్సల్స్​ సానుభూతి పరులను పోలీస్​లు అదుపులోకి తీసుకుంటున్నారు. లాడ్జీలకు ఎవరినీ అనుమతించవద్దని పోలీస్​లు హెచ్చరించారు. 

భద్రాచలంతో పాటు సారపాకలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి సోదాలు నిర్వహించి బంధువులైనా కొత్తవారిని ఇంట్లో ఉంచుకోవద్దని పోలీస్​లు సూచిస్తున్నారు. భద్రాచలం, సారపాక పరిసర సమీప ప్రాంతాల్లోని వలస ఆదివాసీల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. రాష్ట్రపతి పర్యటనలో భాగంగా ప్రెసిడెన్షియల్​ ప్రొటెక్షన్​ ఫోర్స్​ మంగళవారం భద్రాచలం చేరుకుంది. బందోబస్తును పర్యవేక్షించింది. 

కాసానిని కలిసిన టీడీపీ జిల్లా నాయకులు

ఖమ్మం టౌన్,వెలుగు : ఈనెల 21 న ఖమ్మంలో తెలుగు దేశం పా బహిరంగ సభ సక్సెస్​ అయిన సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ను ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు మంగళవారం హైదరాబాద్ లో కలిశారు. భవిష్యత్ లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. 

పార్టీ పూర్వవైభవానికి తమవంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గుత్తా సీతయ్య,రాష్ట్ర కార్యదర్శి ఎస్.శ్రీనివాస్ గౌడ్, సిటీ అధ్యక్షులు వివిజయ్, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు ఎన్.రంజిత్, డివిజన్ అధ్యక్షులు జి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

రెండ్రోజులు వ్యవసాయ మార్కెట్​కు సెలవు

ఖమ్మం టౌన్, వెలుగు : సీపీఎం బహిరంగ సభల నేపథ్యంలో కార్మిక సంఘాలు,ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి మేరకు  రేపు,ఎల్లుండి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ గ్రేడ్ వన్ సెక్రెటరీ రుద్రాక్ష మల్లేశం తెలిపారు. రైతులు మార్కెట్ కు ధాన్యం తేవొద్దని చెప్పారు. 

  • మున్సిపాలిటీలలో అవిశ్వాసం టెన్షన్​ .. చక్రం తిప్పుతున్న పలువురు కౌన్సిలర్లు
  • కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్లో విభేదాలు

భద్రాద్రికొత్తగూడెం,వెలుగు: జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలలో అవిశ్వాసం టెన్షన్​ నెలకొంది. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలలో టీఆర్​ఎస్​ పాలకవర్గాలున్నాయి. ఈ టీఆర్ఎస్​ ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు రోజు రోజుకూ రచ్చకెక్కుతున్నాయి. ఇందులో భాగంగానే ఆయా మున్సిపాలిటీల చైర్మన్లను గద్దె దించేందుకు అధికార పార్టీ కౌన్సిలర్లే పావులు కదుపుతున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపాలిటీలో చైర్ పర్సన్​ కాపుసీతాలక్ష్మిపై అవిశ్వాసం పెట్టేందుకు టీఆర్​ఎస్​ పార్టీలోని పలువురు కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జనవరిలో అవిశ్వాసం పెట్టేందుకు ప్లాన్​ చేస్తున్నారు. 

ఆవిశ్వాసానికి స్కెచ్​.. 

జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలున్నాయి. పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగలేదు. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో టీఆర్​ఎస్​ అత్యధిక స్థానాలను గెలుచుకొని పాలకవర్గాలను ఏర్పాటు చేసింది. కొత్తగూడెం మున్సిపాలిటీలో చైర్మన్​ ఎన్నిక అయినప్పటి నుంచీ టీఆర్​ఎస్​ లో కౌన్సిలర్లలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

జనవరితో పాలకవర్గాలకు మూడేండ్లు ముగియనుండడంతో ఆవిశ్వాసానికి అధికార పార్టీలోని పలువురు కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు.   చైర్​ పర్సన్​ కె. సీతాలక్ష్మి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆమెకు వ్యతిరేకంగా కౌన్సిల్​ మీటింగ్​లలో అధికార పార్టీ కౌన్సిలర్లే ప్రతిపక్ష పాత్ర పోషించిన సందర్భాలున్నాయి.

ఈ క్రమంలోనే సోమవారం బూడిదగడ్డ ఏరియాలో 11 మంది టీఆర్​ఎస్​ కౌన్సిలర్లు రహస్య మీటింగ్​ నిర్వహించారు. జనవరిలో అవిశ్వాసం పెట్టే విషయంపై చర్చించారు.  అవిశ్వానికి సీపీఐ కౌన్సిలర్ల మద్దతు కోరేందుకు ఆ పార్టీ జిల్లా సెక్రటరినీ కలిశారు.   కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐకి ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నారు.  పార్టీలోని పెద్దల నుంచి తమకు ఆశీస్సులున్నాయని ఆవిశ్వాసంలో విజయం సాధిస్తామంటూ చైర్​ పర్సన్​ వ్యతిరేక వర్గీయులు పేర్కొనడం గమనార్హం. 

ఏ విషయంలోనూ తమతో చైర్​ పర్సన్​ కలిసిరారని, ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం, కేవలం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కొడుకు వనమా రాఘవ మాటలకే చైర్​ పర్సన్​ ప్రధాన్యం ఇస్తూ మిగిలిన కౌన్సిలర్లను చులకనగా చూస్తున్నారంటూ ఆ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఇల్లెందు మున్సిపాలిటీలో చైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వర్​రావుకు వ్యతిరేకంగా వైస్​ చైర్మన్​ జానీ పాషా పావులు కదుపుతున్నారు. ఆవిశ్వాసం పెట్టేందుకు అధికార టీఆర్​ఎస్​ పార్టీలోని కౌన్సిలర్లతో గత కొంత కాలంగా మంతనాలు సాగిస్తున్నారు. 

టీఆర్​ఎస్​ పార్టీలోని మున్సిపాలిటీ కౌన్సిలర్లలో నెలకొన్న విభేదాలను పరిష్కరించడంలో కొత్తగూడెం, ఇల్లెందు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, భానోత్​ హరిప్రియతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో వర్గ విభేదాలను ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధ్యక్షులే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.