గురుకుల టీచర్ల.. సమస్యలు పరిష్కరించాలి

గురుకుల టీచర్ల.. సమస్యలు పరిష్కరించాలి

ఆసిఫాబాద్, వెలుగు: గురుకుల టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆసిఫాబాద్​ జిల్లా కలెక్టరేట్ ఎదుట టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైద్య శాంతి కుమారి, సోయం ఇందురావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖ, జ్యోతిబాపూలే, బీసీ వెల్ఫేర్, మైనార్టీ గురుకులాలు సమస్యల్లో మునిగిపోయాయని పేర్కొన్నారు. టీచర్ల పని భారాన్ని తగ్గించి మానసిక ఒత్తిడి నుంచి విముక్తి చేయాలన్నారు. గురుకుల టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని,అన్ని సొసైటీల్లోనూ ఏకరూప పరిపాలన అమలు చేయాలని డిమాండ్​చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నాయకులు సింగతి ఉపేందర్, సత్యనారాయణ, హేమంత్ షిండే, తంగడిపల్లి రమేశ్, కోట తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

టీచర్లపై అధిక భారం

మంచిర్యాల: గురుకులాల్లోని టీచర్ల సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజావేణు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తగినంతమంది టీచర్లను నియమించకపోవడంతో ఉన్నవారిపై అధిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బోధనేతర పనులతో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జి.చక్రపాణి, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఆగచారి, జిల్లా కోశాధికారి  కిరణ్, కార్యదర్శులు పాల్గొన్నారు.
 

ALSO READ :ముథోల్​లో ​బీఆర్ఎస్​కు ​షాక్..  రేవంత్​ రెడ్డితో భేటీ

కేర్​ టేకర్​లను నియమించాలి

ఆదిలాబాద్: గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.వెంకట్ డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టీచర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. గురుకుల టీచర్లపై పనిభారం తగ్గించి నియామకాలు చేపట్టాలన్నారు. కేర్ టేకర్, డిప్యూటీ వార్డెన్ లను నియమించి, టీచర్లకు నైట్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్వామి, అశోక్, ఉపాధ్యక్షుడు సూర్యకుమార్, కోశాధికారి కడదరపు కిష్టన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.