
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా..? అని ప్రశ్నించారు. మావోయిస్టుల పేరుతో యువకులను కాల్చి చంపించారని ఆరోపించారు చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం దోపిడీకి గురైందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకే చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని కామెంట్ చేశారు. ఏదో ఉద్దరించానని చంద్రబాబు చెబితే ప్రజలు నమ్ముతారా..? అని ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ లేకుండా చేశానని చంద్రబాబు చెప్పడం పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు. ఏ రంగంలోనైనా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తోందన్న మంత్రి హరీష్ రావు .. ఇతర రాష్ట్రాలు తాము ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నాయని చెప్పారు.
రైతుల కోసం కల్లాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే..అవి తప్పని రూ.150కోట్లు వాపస్ ఇవ్వాలని కేంద్రం అడుగుతోందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం చేపల కోసం కల్లాలు ఏర్పాటు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది.. గానీ పంటలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రైతులపై ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు. రైతుల కోసం కొత్త చట్టాలు తెచ్చి 750 మందిని పొట్టపెట్టుకున్న చరిత్ర బీజేపీదేనని ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి, రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం నష్టం కలిగిస్తోందని అన్నారు.
రేపు అన్ని జిల్లాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కల్లాలు ఎందుకు కట్టొద్దో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ కూలీలకు సరిగా డబ్బులు ఇవ్వడం లేదని, ఇప్పటివరకు రూ.50వేల కోట్లకుపైగా కూలీ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. కల్లాలు ఏర్పాటు నిషేధాన్ని మానుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. రేపు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని స్పష్టం చేశారు.