ఉపాధి కోల్పోతామని రజకుల ఆందోళన

ఉపాధి కోల్పోతామని రజకుల ఆందోళన
  • వెంచర్ల కోసమే రింగ్ రోడ్డు ప్లాన్
  • చక్రం తిప్పుతున్న గులాబీ లీడర్లు‌

నిజామాబాద్, వెలుగు: ఇందూరు ధోబీఘాట్ స్థలంపై రియల్ కన్ను పడింది. రియల్టర్ల ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ లీడర్లు ఇక్కడ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. రింగ్‌ రోడ్డు వస్తే ఇక్కడ భూముల రేట్లు పెరిగి, రియల్టర్లకు కోట్లలో లాభాలొచ్చే చాన్స్‌ ఉంది.

39 ఏళ్ల కింద 1.9 ఎకరాలు...
నగరంలోని కోటగల్లి సమీపంలో ధోబీఘాట్ నిర్మాణానికి 1983లో ప్రభుత్వం1.9 ఎకరాలను కేటాయించింది. ఇక్కడ 250  కుటుంబాలు కుల వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ భూమి పక్కనే కొందరు రియల్టర్లు మూడేళ్ల కింద భూమిని కొనుగోలు చేసి వెంచర్ చేశారు. దానికి దారి లేకపోవడంతో టీఆర్ఎస్ నేతలను ఆశ్రయించారు. అధికార పార్టీ కావడంతో వారు నాలుగు నెలల కింద జేసీబీతో ధోబీఘాట్ కేటాయించిన స్థలం మీదుగా రోడ్డు కోసం తవ్వకాలు జరిపారు.  తమకు కేటాయించిన భూమిలో రోడ్డు నిర్మాణం ఎలా చేస్తారని రజకులు అడ్డుకున్నారు. 

అసలు కథ...
కోటగల్లి ధోబీఘాట్ పక్కన 1973 మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద ఫీట్ల రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే తర్వాత కాలంలో నగరం విస్తరించి ఆ స్థలం సిటీలో మధ్యలోకి వచ్చింది. దీంతో పాత ప్లాన్‌ను రద్దు చేసి కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించారు. కానీ, ఈ ప్లాన్‌ రెడీ కాకముందే కొందరు లీడర్లు ధోబీఘాట్‌ భూమిలో నుంచి రోడ్డు వేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ధోబీఘాట్ వెనుక ఏర్పాటు చేసిన రియల్ వెంచర్లకు డిమాండ్ పెరుగుతుంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి భర్త, స్థానిక కార్పొరేటర్, నగర కమిటీ నాయకుడు కలిసి రోడ్డు ప్లాన్‌ అమలుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే రూ. 50 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఆఫీసర్ల సహకారంతో...
లీడర్లు తెరపైకి తెచ్చిన రింగ్‌ రోడ్డు ప్రతిపాదనలను రజకులు వ్యతిరేకిస్తున్నా.. కార్పొరేషన్ ఆఫీసర్లు మాత్రం సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థలంలో కొన్ని రోజు కింద రజకులు తమ నాయకురాలు చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే విగ్రహానికి పర్మిషన్ లేదని మున్సిపల్ ఆఫీసర్లు ముందస్తుగానే నోటీసులు ఇవ్వడంపై వారు మండిపడ్డారు. మున్సిపల్ కొత్త మాస్టర్ ప్లాన్‌కు అప్రూవల్ రాక ముందే ఈ స్థలం మీదుగా 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం జరుగుతుందని ఆఫీసర్లు నోటీసులు జారీ చేయడం వెనుక అధికార పార్టీ నేతల కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. అయితే విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ప్రతిపక్ష పార్టీలు రజకులకు మద్దతు ఇవ్వడంతో ఆఫీసర్లు సైలెంట్‌ అయ్యారు. 

రియల్ దందా కోసమే రింగ్ రోడ్
ధోబీఘాట్‌ ఉన్న వెంచర్ల కోసమే ఆఫీసర్లు రింగ్ రోడ్​ ప్రతిపాదనలు సిద్ధం చేసిన్రు. ఇందులో టీఆర్ఎస్ నేతల కుట్ర ఉంది. ప్రభుత్వం తమకు ఇచ్చిన స్థలంలో దౌర్జన్యంగా రోడ్డు వేయాలని చూస్తే ఊరుకోం. ధోబీఘాట్ స్థల ఆక్రమణపై ఉన్నతాధికారులు స్పందించాలి.– అజయ్, రజక జనసేన సంఘం, జనరల్ సెక్రటరీ