CSK vs KKR: ధోనీ లాంటి కెప్టెన్ ఉండడు.. మహేంద్రుడిపై గంభీర్ ప్రశంసలు

CSK vs KKR: ధోనీ లాంటి కెప్టెన్ ఉండడు.. మహేంద్రుడిపై గంభీర్ ప్రశంసలు

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. సోమవారం(ఏప్రిల్ 8) చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా స‌మావేశంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పాత రోజుల‌ను గుర్తు చేసుకున్నాడు. తన సహచర ఆటగాడు, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ప్రశంసలు కురిపించాడు. అలాగే, సూపర్ కింగ్స్‌తో తనకున్న పోటీ తత్వాన్ని గుర్తు చేసుకున్నాడు. 

గంభీర్‌ నాయకత్వంలో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్(2012, 2014) రెండు ఐపీఎల్ టైటిల్స్‌ చేజిక్కించుకుంది. మొద‌టి సారి ఫైన‌ల్‌లో కోల్‌క‌తా.. చెన్నైని ఓడించి టైటిల్ సొంతం చేసుకోవడం విశేషం. చెన్నై నిర్ధేశించిన 192 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా విజ‌య‌వంతంగా ఛేదించింది. ఆ మ్యాచ్‌కు ముందు తన మనస్సులో గెలవాలనే ఆలోచన తప్ప ఓడిపోతే అన్న పదాలే తట్టలేదని గంభీర్ వెల్లడించాడు. 2012 ఫైనల్ కు ముందు మీ మనస్సులో ఎలాంటి ఆలోచ‌నలు ఉండేవి అన్న ప్ర‌శ్నకు ఈ విధంగా బదులిచ్చాడు.

"నేను గెలవాలనుకున్నాను. నా మనసులో చాలా స్పష్టంగా ఉన్నాను. మేమిద్దరం స్నేహితులు.. పరస్పర గౌరవం, ప్రతిదీ అలాగే ఉంటుంది. ఆ సమయంలో నేను కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్నా.. అతను(ధోని) సీఎస్‌కేకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బహుశా మీరు అతన్నీ అడిగినా.. ఇదే సమాధానం వస్తుందని అనుకుంటున్నా.. టీమ్ఇండియా త‌రుపున‌ విజ‌య‌వంత‌మైన కెప్టెన్ల‌లో ఎంఎస్ ధోని ఒక‌రు. 3 ఐసీసీ ట్రోఫీలు అందించి అత‌నిలా ఆ స్థాయికి మరొకరు చేరుకోగలరని నేను అనుకోవడం లేదు.." అని గంభీర్ అన్నాడు.

ధోనీ దూకుడుగా ఉండడు కానీ, దేన్నీవదులుకోడు

గంభీర్.. ధోని కెప్టెన్సీ, అతని వ్యూహాత్మక ఫీల్డ్ సెటప్‌లపైన ప్రశంసలు కురిపించాడు. విజయానికి ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు అవసరమైనప్పుడు కూడా ధోని ఫినిషింగ్ నైపుణ్యాల గురించి ప్రత్యర్థి జట్లు జాగ్రత్తగా ఉంటాయని గంభీర్ తెలిపాడు.

"అవును.. ఐపిఎల్‌లో, ఎంఎస్‌కు ఆ వ్యూహాత్మక మనస్తత్వం ఉందని నాకు తెలుసు కాబట్టి, దానిలోని ప్రతి బిట్‌ను ఆస్వాదించాను. అతను చాలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటాడు. స్పిన్నర్లను ఎలా నియంత్రించాలో, వారికి వ్యతిరేకంగా ఫీల్డ్‌లను ఎలా సెట్ చేయాలో అతనికి బాగా తెలుసు.. ఎప్పటికీ దాన్ని వదులుకోడు. అతను నంబర్ 6 లేదా 7లో బ్యాటింగ్ చేశాడు. అతను అక్కడ ఉన్నంత వరకు ఆటను ముగించగలడనేది మాకు తెలుసు. ఒక ఓవర్‌లో 20 పరుగులు అవసరం అయినప్పటికీ, ఎంఎస్ క్రీజులో ఉంటే మ్యాచ్ ముగించగలడు. అదే అతనిలో ఉన్న గొప్ప లక్షణం.." అని గంభీర్ వెల్లడించాడు. 

ఎల్లప్పుడూ ధోనీపై విమర్శలు చేసే గంభీర్.. ఉన్నట్టుండి అతన్ని ప్రశంసించడం చర్చనీయాంశంగానూ మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు నెట్టింట పెద్ద చర్చ సాగిస్తున్నారు.