ధురంధర్ 2’ (Dhurandhar 2) చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణపై దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar) ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ (AI) మార్ఫింగ్ కంటెంట్‌పై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ‘ధురంధర్ 2: ది రివెంజ్’కు సంబంధించిన కొన్ని ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే జరుగుతున్న తప్పుడు ప్రచారంపై గురువారం (మార్చి 26న) దర్శకుడు ఆదిత్య ధర్ స్పందించారు.
ఇందులో భాగంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక మార్ఫింగ్ ఫోటోపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ ఫోటో సినిమాకు సంబంధించినది కాదని, అది పూర్తిగా ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ కంటెంట్ అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని X (ట్విట్టర్) వేదికగా అధికారికంగా వెల్లడించారు
ఈ మూవీలో హీరో రణవీర్ సింగ్ ఓ సీన్ లో సిగరెట్ తాగే ఫోటో వివాదంపై డైరెక్టర్ ఆదిత్య ధర్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ (AI) మార్ఫింగ్ చిత్రాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. ముఖ్యంగా, రణవీర్ తలపాగా ధరించి సిగరెట్ తాగుతున్నట్లు చూపిస్తున్న ఫేక్ ఫోటోపై వివరణాత్మక ప్రకటన విడుదల చేశారు.
ముంబైలోని ఒక సిక్కు సంఘం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సినిమా ప్రమోషన్ పోస్టర్‌లో సిక్కు సంప్రదాయాలను అవమానించే విధంగా సన్నివేశం ఉందని ఆరోపిస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో స్పందించిన దర్శకుడు ఆదిత్య ధర్, ఆ చిత్రంలో అలాంటి సన్నివేశం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. అధికారికంగా విడుదల చేసిన ప్రచార సామగ్రిని కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మార్ఫ్ చేసి, తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని తెలిపారు.
“ హంజా (జస్క్రీత్) పాత్ర తలపాగా ధరించి ధూమపానం చేస్తున్నట్లు చూపిస్తున్న చిత్రం పూర్తిగా కల్పితం. ఇది మా చిత్రంలో భాగం కాదు, అలాగే మా అధికారిక ప్రమోషనల్ కంటెంట్‌లో కూడా లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు, గందరగోళం సృష్టించేందుకు చేసిన దుష్ప్రచారం,” అని ఆయన పేర్కొన్నారు.
అలాగే, సిక్కు సమాజం పట్ల తనకు అత్యంత గౌరవం ఉందని ఆదిత్య ధర్ స్పష్టం చేశారు. చిత్రంలోని ప్రతి పాత్రను అత్యంత సున్నితత్వంతో, గౌరవప్రదంగా మరియు బాధ్యతాయుతంగా రూపొందించామని తెలిపారు. దీనికి విరుద్ధంగా చూపించే ఎలాంటి మార్ఫింగ్ కంటెంట్ పూర్తిగా దురుద్దేశపూర్వకమని పేర్కొన్నారు.
🙏@RanveerOfficial @rampalarjun @duttsanjay @ActorMadhavan #AkshayeKhanna #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande @LokeshDharB62 @jiostudios @B62Studios @TSeries @JioHotstar @StarGoldIndia pic.twitter.com/VMCS4ImdG4
— Aditya Dhar (@AdityaDharFilms) March 26, 2026
చివరిగా, ప్రేక్షకులు అధికారికంగా విడుదలైన కంటెంట్‌ను మాత్రమే నమ్మాలని, సినిమాను అసలు రూపంలోనే చూడాలని ఆయన కోరారు. దురుద్దేశాలతో ప్రచారం చేస్తున్న ఏఐ ఆధారిత తప్పుడు సమాచారానికి బలి కాకూడదని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా డైరెక్టర్ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. మార్చి 19న విడుదలైన ఈ మూవీ రికార్డ్ వసూళ్ళతో రణవీర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌గా నిలిచింది. కేవలం ఏడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000కోట్ల క్లబ్‌లో చేరింది. సినిమా థియేటర్ రన్ టైం ముగిసేలోపు రూ.2000కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
