దేశభక్తే బ్రాండ్: ‘ఉరి’తో సంచలనం.. ‘ధురంధర్’తో రికార్డుల వర్షం.. సినిమాను మించిన లైఫ్ స్టోరీ డైరెక్టర్ ఆదిత్య ధర్ది

దేశభక్తే బ్రాండ్: ‘ఉరి’తో సంచలనం.. ‘ధురంధర్’తో రికార్డుల వర్షం.. సినిమాను మించిన లైఫ్ స్టోరీ డైరెక్టర్ ఆదిత్య ధర్ది

బాలీవుడ్‌‌లో ఈ మధ్యకాలంలో పేట్రియాటిక్ సినిమాలు అంటే గుర్తుకొచ్చే పేరు ఆదిత్య ధర్ (Aditya Dhar). 2019లో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’తో డైరెక్టర్‌‌గా డెబ్యూ చేసి ఓవర్​నైట్ స్టార్​గా మారాడు. 2025లో ‘ధురంధర్’తో ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం రాశాడు. రణ్​ వీర్ సింగ్ నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించి, కొవిడ్ తర్వాత బాలీవుడ్‌‌లో కొత్త రికార్డు సృష్టించింది.

ఇప్పుడు అదే సినిమా రెండో భాగాన్ని ఆడియెన్స్​ ముందుకు తీసుకొచ్చాడు. ఈసారి కూడా అతని టాలెంట్​కు దేశమొత్తం ఏకమై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.  ఇంతటి విజయాలు అందుకుంటోన్న ఆదిత్య ధర్​ జీవితం  కూడా ఒక ఫీచర్ ఫిల్మ్ లాగానే ఉంటుంది.

1983 మార్చి12న న్యూఢిల్లీలో కశ్మీరీ పండిత్ కుటుంబంలో ఆదిత్య ధర్ పుట్టాడు. టెర్రరిజం వల్ల తన కుటుంబం కశ్మీర్ వ్యాలీని వదిలి ఢిల్లీలో స్థిరపడింది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న ఆదిత్యకి చిన్నప్పటి నుంచి సినిమాలు, థియేటర్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలిసినవారు ఎవరూ లేకపోవడంతో కొన్నాళ్లపాటు ఆ కల నిజమయ్యేందుకు దారులు కనపడలేదు. దాంతో ఢిల్లీలోనే రేడియో జాకీగా పని చేశాడు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో పని దొరికింది.

డైరెక్టర్​ అవ్వాలనుకుని వెళ్తే రైటర్​గా చాన్స్ ఇచ్చారు. అది కూడా పాటల రచయితగా..! ‘కాబుల్ ఎక్స్‌‌ప్రెస్’, ‘హాల్- ఎ- దిల్’ వంటి సినిమాలకు పాటలకు రాశాడు. వాటికి ఎంతో ఆదరణ లభించింది. కానీ, కథ రాసే అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత నాటకాల్లో నటించాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా పని చేశాడు.

ఇలా కొన్ని సంవత్సరాలపాటు బ్యాక్​గ్రౌండ్​లో ఉంటూ ఎవరూ గుర్తించని పనులు చేస్తూ గడిపాడు. “నాకు ఫిల్మ్ బ్యాక్‌‌గ్రౌండ్ లేదు, కనెక్షన్స్ లేవు. కేవలం కథ చెప్పాలనే మక్కువతో ముందుకు వచ్చాను” అని డైరెక్టర్ అయిన కొత్తలో ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య చెప్పాడు.

పర్సనల్ లైఫ్ 

2021లో ఆదిత్య, యామీ గౌతమ్​ను వివాహం చేసుకున్నాడు. వాళ్లకు ఇప్పుడు ఒక కొడుకు ఉన్నాడు. యామీ ‘ఆర్టికల్ 370’ (2024) సినిమాలో నటించగా, ఆదిత్య ఆ సినిమాను తన బ్యానర్‌‌లో నిర్మించాడు. యామీ ఆదిత్య మొదటి సినిమా ‘ఉరి’లో హీరోయిన్‌గా నటించింది. అప్పుడే వాళ్ల మధ్య చిగురించిన ప్రేమగా మారి, పెళ్లికి దారితీసింది. ఆదిత్య.. సోదరుడు లోకేష్ ధర్‌‌తో కలిసి 2019లోనే ‘B62’ స్టూడియోస్ స్థాపించాడు. ఆ స్టూడియో పేరు వారి ఢిల్లీ చైల్డ్‌‌హుడ్ అడ్రస్ అట! ఇప్పుడు అతను డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్, లిరిక్స్ రైటర్ అన్ని రోల్స్‌‌లో సక్సెస్‌‌ఫుల్.

ఆదిత్య ధర్ ఎందుకంత స్పెషల్?

ఆదిత్య ధర్ సినిమాల్లో కేవలం యాక్షన్ కాదు... భావోద్వేగం, రియలిజం, సమకాలీన సమస్యలు ఉంటాయి. ఆర్మీ సైనికుల గౌరవం, దేశం కోసం పోరాడే వారి కథలు చెప్పడంలో దిట్ట. “నా సినిమాలు ఎవరి గురించి కాదు... దేశం గురించి” అని అతను తరచూ చెప్తుంటాడు. 43 ఏళ్ల ఆదిత్య ధర్ ఇప్పుడు బాలీవుడ్‌‌లో  టాప్ డైరెక్టర్లలో ఒకరిగా స్థానం సంపాదించాడు. కానీ అతని సింప్లిసిటీ, కష్టపడే తత్వం ఇంకా మారలేదు. ఢిల్లీలోని ఓ చిన్న ఇంటి నుంచి బాలీవుడ్ స్టేజ్‌‌ల వరకు సాగిన తన  ప్రయాణం... ఇది కేవలం ఒక డైరెక్టర్ జీవితం కాదు. ‘కథ చెప్పాలనే మక్కువతోపాటు ఓపిక కూడా ఉంటే ఎవరైనా సాధించొచ్చు’ అని చెప్పే ఒక ఇన్‌‌స్పైరింగ్ స్టోరీ.

‘ఉరి’ అటాక్... 

ఆదిత్య డైరెక్టర్​గా మొదటి ప్రాజెక్ట్ ధర్మా ప్రొడక్షన్స్‌‌ లో చేశాడు. కానీ 2016లో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అనేక మంది ఆ సమయంలో సర్జికల్ స్ట్రైక్ గురించి ఆలోచిస్తూ భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఆదిత్య వాళ్లందరికీ భిన్నంగా ఆలోచించాడు. ఇండియన్ ఆర్మీతో గడపడం మొదలుపెట్టాడు. రిటైర్డ్​ ఆర్మీ ఆఫీసర్స్​ని కలిసి వాళ్ల కథలు విన్నాడు. వారి లైఫ్​, లైఫ్​ స్టయిల్​ గమనించాడు.

అలా వందల మంది ఆఫీసర్స్​ అనుభవాలే ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ స్క్రిప్ట్‌‌కు ఆధారం అయ్యాయి. 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌‌ను ఊపేసింది. దాదాపు 350 కోట్లకు పైగా వసూలు చేసింది. దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన డెబ్యూ డైరెక్టర్ సినిమాగా నిలిచింది. నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్, ఫిల్మ్‌‌ఫేర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్... ఇలా అవార్డుల వర్షం కురిసింది. ఒక్క సినిమాతోనే ఆదిత్య ధర్ బాలీవుడ్‌‌లో ‘పేట్రియాటిక్ స్టోరీటెల్లర్’గా స్థానం సంపాదించాడు.

రికార్డులు బద్దలు కొట్టిన దురంధర్!

2024లో ‘దురంధర్’ అనౌన్స్ అయినప్పుడే హైప్ మొదలైంది. 2025లో రిలీజ్ అయిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌‌లో రణ్​ వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్​ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రామ్​పాల్ వంటి స్టార్ కాస్ట్ ఉంది. ఆదిత్య రాసి, డైరెక్ట్ చేసి, నిర్మించిన ఈ సినిమా దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన హిందీ సినిమా అయింది. ఎన్నో రికార్డ్స్​ను బ్రేక్​ చేసింది దురంధర్.

సినిమా నిడివి ఎక్కువ కావడంతో రెండు భాగాలుగా విడుదల చేశాడు. మార్చి 19, 2026న విడుదలైన ‘దురంధర్: ది రివెంజ్’ కూడా భారీ సక్సెస్ అందుకుంది. యాక్షన్ సీక్వెన్స్, దేశభక్తి, రియల్ లైఫ్ ఇన్‌‌స్పిరేషన్... ఆదిత్య మార్క్​ ఇందులోనూ కనిపించింది. ఈ సినిమా కూడా రికార్డ్ బ్రేకింగ్‌ వసూళ్లతో దూసుకెళ్తోంది.  10 రోజుల్లోనే రూ.1226 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ లో ఇప్పటివరకు రూ.296 కోట్లు రాబట్టింది.