భూకంపాల డేటాతో వజ్రాల వేట

భూకంపాల డేటాతో వజ్రాల వేట
  •     కొత్త వజ్రాల గనులు కనుగొంటామంటున్న రీసెర్చర్లు
  •     ఏడాదిలోపే డైమండ్ మైన్స్ మ్యాపులు రెడీ చేస్తామని వెల్లడి

ఒకప్పుడు ప్రపంచంలో చాలా దేశాలకు వజ్రాలను సప్లై చేసిన దేశం మనది. కానీ..1700 సంవత్సరం తర్వాత సీన్ మారిపోయింది. మనదేశంలో డైమండ్ మైనింగ్ క్రమంగా తగ్గిపోయింది. అదే సమయంలో బ్రెజిల్​లో పెద్ద ఎత్తున వజ్రాల గనులు వెలుగులోకి రావడంతో వజ్రాలను సప్లై చేయడంలో ఆ దేశం నెంబర్ వన్​గా మారింది. ఒకప్పుడు మన దేశంలో చాలా చోట్ల వజ్రాల గనులు ఉండేవి. రానురాను అన్నీ మూతబడిపోయాయి. ప్రస్తుతం మన దేశంలో చట్టబద్ధంగా డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్​లోని పన్నా ఏరియాలో మాత్రమే కొనసాగుతోంది. అందుకే..  దేశంలో  కొత్త వజ్రాల గనులను గుర్తించేందుకు పుణేలోని ఐఐఎస్ఈఆర్, ఐఐటీ (ఐఎస్ఎం) ధన్ బాద్​కు చెందిన ముగ్గురు రీసెర్చర్లు తాజాగా రీసెర్చ్ షురూ చేశారు.

20 ఏళ్ల భూకంపాల డేటాతో..

భూమి ఉపరితలం (క్రస్ట్)లో 300 కోట్ల ఏండ్ల కిందట విపరీతమైన ఒత్తిడి, వేడి కారణంగా కార్బన్ అణువులు స్ఫటికాలుగా మారి వజ్రాలు ఏర్పడ్డాయని సైంటిస్టులు చెప్తారు. ఇవి క్రస్ట్ లో150 నుంచి 200 కిలోమీటర్ల లోతులో ఉన్నాయని అంటారు. అయితే, భూకంపాలు వచ్చినప్పుడల్లా క్రస్ట్​లోని మట్టి, రాళ్ల పొరలు కదిలిపోయి.. వజ్రాలు పైపైకి వస్తాయని పేర్కొంటారు. అందుకే.. ఆయా చోట్ల భూకంపాలు వచ్చినప్పుడు ప్రకంపనల తీరు ఎలా ఉందన్నదాన్ని బట్టి.. ఆ ఏరియాల్లో వజ్రాలు ఉండేందుకు చాన్స్ ఎంతుంది? అన్నది అంచనా వేయాలని ఐఐఎస్ఈఆర్ ప్రొఫెసర్ శ్యామ్ ఎస్. రాయ్, ఆయన టీం మెంబర్లు గోకుల్ సాహ, శాలివాహన్ సిద్ధమయ్యారు. ఆ ముగ్గురూ గతేడాది ఓ రీసెర్చ్ పేపర్​ను ‘జర్నల్ ఆఫ్​ఎర్త్ సిస్టమ్ సైన్స్’ లో పబ్లిష్​చేశారు. దక్షిణ–తూర్పు ఇండియాలో పరిధిలోని  ధార్వాడ్ నుంచి బస్తర్, సింగ్భూం వరకూ ఒక డైమండ్ కారిడార్ ఉన్నట్లు వీరు ఆ రీసెర్చ్​లో అంచనా వేశారు. ఈ ఏరియాల్లో గతంలో భూకంపాలు వచ్చిన సందర్భంగా సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ప్రకంపనలు వచ్చాయని వాళ్లు గుర్తించారు. దీని ఆధారంగానే.. వాళ్లు ఇప్పుడు వజ్రాల గనుల వేటలో పడ్డారు. ఇందుకోసం.. గత 20 ఏళ్లలో దక్షిణాసియాలో వచ్చిన 30 వేల భూకంపాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించాలని అనుకుంటున్నారు. తాము 25 చదరపు కిలోమీటర్ల కచ్చితత్వంతో వజ్రాల గనులను గుర్తిస్తామని, డైమండ్ మైనింగ్ కంపెనీలకు ఇప్పటికంటే ఎంతో మెరుగైన, కచ్చితమైన డేటాను ఇస్తామని వెల్లడించారు. దేశంలో కొత్త వజ్రాల గనుల మ్యాపులను ఏడాదిలోపే రెడీ చేస్తామన్నారు.