
వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఆంటోని.. త్వరలో ‘హిట్లర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ధన దర్శకత్వంలో డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి శుక్రవారం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వర్షంలో తడుస్తూ కూర్చోన్న విజయ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
ఊళ్లో ఇళ్లకు ఎవరో నిప్పు అంటించినట్టుగా కనిపిస్తుంది. మరోవైపు.. ట్రైన్ జర్నీలో ఉన్న విజయ్ ఆంటోని ఒక క్రైమ్ ఇన్సిడెంట్‌ను ఎదుర్కొన్నట్లు మోషన్ పోస్టర్‌లో చూపించారు. ఇదే ట్రైన్‌లో హీరోయిన్ రియా సుమన్‌ను కలుసుకుంటాడు. గన్ పేలుస్తోన్న గౌతమ్ మీనన్ కీలక పాత్రలో కనిపించాడు. ఫ్రెష్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తూనే.. చివరలో జోకర్ గెటప్‌లో కనిపించి సినిమాపై క్యూరియాసిటీ పెంచాడు విజయ్ ఆంటోని.
కొందరు పొలిటికల్ లీడర్స్ డిక్టేటర్స్‌గా ప్రవర్తిస్తే.. వారిని ఎదుర్కొనే సాధారణ పౌరుడి కథే ‘హిట్లర్’ అని చెప్పారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని, తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెప్పారు. వివేక్, మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.