
నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక్క బీసీని సీఎంగా చేయని కాంగ్రెస్... బీసీ రిజర్వేషన్ డ్రామా ఆడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం కాదని సీఎం రేవంత్‌రెడ్డికి తెలుసని, బీజేపీపై బురదజల్లడానికి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ జిల్లా ఆఫీస్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన బీసీ ధర్నాకు రాహుల్‌గాంధీ ఎందుకు హాజరుకాలేదో చెప్పాలన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు కోసం స్పీకర్‌ను టైం అడిగారా ? మోదీతో మాట్లాడారా లేక బీజేపీని అడిగి రిజర్వేషన్ హామీ ఇచ్చారా ? అని మండిపడ్డారు.
మాజీ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్ చేతిలో చిప్ప పెట్టాడని తాను మొదటి నుంచీ చెప్తూనే ఉన్నానని, కానీ.. సంపద ఎలా సృష్టించాలో తెలుసన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. దొంగ ఓట్లు, ఫేక్ పాస్ట్‌పోర్టులు జారీ చేసిన కల్వకుంట్ల కుటుంబం దేశభద్రతకే డేంజర్ అని అన్నారు.
నిజామాబాద్ మాధవ్‌నగర్ ఆర్‌వోబీ పనులు పూర్తి చేయడానికి పది రోజుల్లో ఫండ్స్ రిలీజ్ చేయాలని, లేదంటే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, స్రవంతిరెడ్డి పాల్గొన్నారు.