రాష్ట్రంలో రోజుకు10 లక్షల లీటర్ల వరకు తగ్గిన డీజిల్‌‌‌‌ సేల్స్

రాష్ట్రంలో రోజుకు10 లక్షల లీటర్ల వరకు తగ్గిన డీజిల్‌‌‌‌ సేల్స్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో డీజిల్‌‌‌‌ అమ్మకాలు బాగా పడిపోయాయి. రోజుకు పది లక్షల లీటర్ల వరకు డీజిల్‌‌‌‌ సేల్స్​ తగ్గాయి. అనేక రాష్ట్రాలు డీజిల్‌‌‌‌పై వ్యాట్‌‌‌‌ తగ్గించినా.. తెలంగాణ తగ్గించకపోవడమే ఇందుకు కారణమని ఆయిల్‌‌‌‌ డీలర్స్‌‌‌‌ చెబుతున్నారు. ట్రావెల్స్‌‌‌‌ మొదలుకొని, పెద్ద పెద్ద కంపెనీలన్నీ రేట్లు తక్కువగా ఉన్న పక్క రాష్ట్రాల్లో డీజిల్‌‌‌‌ను కొని వాడుకుంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

భారీగా తగ్గిన అమ్మకాలు

రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి వరకు రోజుకు కోటి లీటర్ల డీజిల్‌‌‌‌ అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం 90 లక్షల లీటర్ల డీజిల్‌‌‌‌ మాత్రమే అమ్ముతున్నారు. పెట్రోల్‌‌‌‌ కూడా రోజుకు లక్ష లీటర్ల వరకు అమ్మకాలు తగ్గాయి. సాధారణంగా ఏటా 10 నుంచి 15 శాతం పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ అమ్మకాలు పెరుగుతాయి. కానీ రెండేండ్లుగా పెరగకపోగా.. తగ్గుతూ వస్తున్నాయి. 2020 జనవరిలో సగటున రోజుకు 1.30 కోట్ల లీటర్ల డీజిల్‌‌‌‌ అమ్ముడవగా, ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో 90 లక్షల లీటర్లే అమ్ముడైంది. అంటే రోజుకు 40 లక్షల లీటర్లు తగ్గింది. పెట్రోల్‌‌‌‌ కూడా రోజుకు పది లక్షల లీటర్ల మేర తగ్గింది. ఇది ఇంకా తగ్గే అవకాశం ఉందని ఆయిల్‌‌‌‌ డీలర్లు పేర్కొంటున్నారు.

వ్యాట్‌‌‌‌ తగ్గించకపోవడంతోనే..

ఉత్తరప్రదేశ్‌‌‌‌ ఎన్నికల తర్వాత వరుసగా పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ రేట్లు పెరిగిపోయాయి. కేంద్రం లీటర్‌‌‌‌ పెట్రోల్‌‌‌‌పై రూ.5, లీటర్ డీజిల్‌‌‌‌పై రూ.10 ఎక్సైజ్‌‌‌‌ డ్యూటీని తగ్గించింది. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని కేంద్రం సూచించింది. అనేక రాష్ట్రాలు లీటర్‌‌‌‌పై రూ.3 నుంచి రూ.7 వరకు వ్యాట్​ తగ్గించాయి. కానీ తెలంగాణ సర్కారు పైసా కూడా తగ్గించలేదు. ప్రస్తుతం డీజిల్‌‌‌‌పై స్టేట్​ గవర్నమెంట్‌‌‌‌ 27% వ్యాట్‌‌‌‌ను వసూలు చేస్తోంది. అయితే డీజిల్‌‌‌‌ బేస్‌‌‌‌ రేట్‌‌‌‌ పెరుగుతున్న కొద్దీ రాష్ట్రంలో డీజిల్‌‌‌‌ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో బల్క్‌‌‌‌గా కొనుగోలు చేసేవారంతా పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు.

రోజుకు 2.7 కోట్ల ఆదాయం తగ్గింది

వాస్తవానికి డీజిల్‌‌‌‌, పెట్రోల్‌‌‌‌ రేట్లు పెరగడంతో రాష్ట్ర ఖజానా కూడా కళకళలాడాలి. కానీ సీన్‌‌‌‌ రివర్సయ్యింది. ఇక్కడ కొనాల్సిన డీజిల్‌‌‌‌ పక్క రాష్ట్రాల్లో కొంటుండటంతో ఆదాయం మొత్తం అక్కడికి తరలిపోతోంది. రోజుకు 10 లక్షల లీటర్ల డీజిల్‌‌‌‌ తగ్గడంతో రోజుకు 2.70 కోట్ల దాకా ఇన్‌‌‌‌కం తగ్గిపోయింది. ఈ లెక్కన నెలకు రూ.80 కోట్ల దాకా సర్కారు ఆదాయానికి గండి పడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో లీటర్‌‌‌‌ డీజిల్‌‌‌‌ రూ.105.49గా ఉంది. కర్నాటకలో రూ.94.79 మాత్రమే. అంటే లీటర్‌‌‌‌పై దాదాపు రూ.11 దాకా ఆదా అవుతోంది. దీంతో ఇటీవల కర్నాటకలో డీజిల్‌‌‌‌ సేల్స్‌‌‌‌ 30 శాతం పెరిగాయి. ఇందులో అధిక భాగం తెలంగాణదే. ఇక్కడి వారు అక్కడికి వెళ్లి డీజిల్​ కొంటున్నారు. దీంతో అక్కడ వ్యాట్‌‌‌‌ తగ్గించినా సేల్స్‌‌‌‌ పెరగడంతో ఆదాయం అధికమవుతోంది.

బార్డర్‌‌‌‌ దాటంగనే ఫుల్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌

రెట్లు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ డీజిల్‌‌‌‌ కొట్టించడానికి మనోళ్లు భయపడుతున్నారు. కర్నాటక, మహారాష్ట్రలో డీజిల్‌‌‌‌ రేట్లు తక్కువగా ఉన్నాయి. లాంగ్‌‌‌‌ రూట్‌‌‌‌ వెళ్లే ట్రావెల్స్‌‌‌‌ తెలంగాణ బార్డర్‌‌‌‌ వరకు అవసరమయ్యే డీజిల్‌‌‌‌ మాత్రమే కొంటున్నారు. బార్డర్‌‌‌‌ దాటాక అక్కడి బంకుల్లో ఫుల్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌ చేయిస్తున్నారు. ఆర్టీసీ కూడా ఇదే దారిలో వెళ్తోంది. ఇక బడా కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌ కంపెనీలు, ఫార్మా పరిశ్రమలు ఇతర బల్క్‌‌‌‌గా వాడే కంపెనీలు కూడా పక్క రాష్ట్రాల నుంచే ట్యాంకర్లలో డీజిల్ తెచ్చుకుంటున్నాయి. బడా కంపెనీలకు ఇలా ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేసుకొనే వెసులుబాటు ఉంటుందని డీలర్లు చెబుతున్నారు. దీంతో ఆయా కంపెనీలు డబ్బులు ఆదా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.