మేడారం వెళ్లే వాహనాలకు ఓరుగల్లు చిక్కులు

మేడారం వెళ్లే వాహనాలకు ఓరుగల్లు చిక్కులు
  • కరీంనగర్​ వైపు వెళ్లాలంటే చుట్టూ తిరగాల్సిన దుస్థితి
  • నత్తనడకన ఫాతిమా నగర్​ రెండో ఆర్ఓబీ పనులు
  • ఉన్న ఒక్క బ్రిడ్జిపై తరచూ ట్రాఫిక్ జామ్​లు
  • కాజీపేట వైపు నుంచి వచ్చే వాహనాలకూ తిప్పలు
  • ఆఫీసర్లు దృష్టి పెడితేనే ట్రాఫిక్​ కష్టాలకు చెక్​

హనుమకొండ, వెలుగు: మేడారం మహాజాతర మరో 40 రోజుల్లో ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తరలివస్తారు. ఈసారి మేడారం జాతరకు వరంగల్  మీదుగా వాహనాల్లో రాకపోకలు సాగించే భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే హైదరాబాద్–భూపాలపట్నం హైవేకు బైపాస్​గా వరంగల్ లో నిర్మించిన రింగ్​ రోడ్డుపై డిజైన్​ లోపాల వల్ల వాహనాదారులకు సమస్యలు ఎదురవుతున్నాయి.

అలాగే సిటీ మధ్యలో నిర్మిస్తున్న ఫాతిమా నగర్​ సెకండ్​ ఆర్ఓబీ పనులు పూర్తికాక ట్రాఫిక్ తో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోవైపు ఇన్నర్​ రింగ్ రోడ్డు ఊసే లేకపోవడంతో ఖమ్మం వైపు నుంచి వచ్చే వాహనాలకూ తిప్పలు తప్పడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే మేడారం జాతర సందర్భంగా వేల సంఖ్యలో వచ్చే వాహనాలతో నగర ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చు.

రింగ్ రోడ్డులో పాలతో సమస్యలు

హైదరాబాద్​ వైపు నుంచి వరంగల్  మీదుగా ములుగు, ఏటూరు నాగారంతో పాటు పరకాల, భూపాలపల్లి వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలతో వరంగల్​లో ట్రాఫిక్​ ఇబ్బందులు ఏర్పడేవి. ఈ సమస్య పరిష్కారానికి హైదరాబాద్–-భూపాలపట్నం నేషనల్​ హైవే-163లో భాగంగా యాదగిరిగుట్ట నుంచి వరంగల్  శివారు దామెర వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో 99 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. రూ.2 వేల కోట్లతో  నిర్మించిన ఈ రోడ్డుపై నిర్మాణ లోపాల కారణంగా మోటారిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ములుగు వైపు నుంచి రింగ్  రోడ్డు మీదుగా వచ్చే వాహనదారులు.. కరీంనగర్​ వైపు వెళ్లాలంటే  గందరగోళానికి గురవుతున్నారు. ములుగు వైపు నుంచి వచ్చే మోటారిస్టులు చింతగట్టు క్యాంప్​ వద్ద రింగ్​ రోడ్డు దిగి వరంగల్–-కరీంనగర్​ హైవే ఎక్కాలి. కానీ, డిజైన్​ లోపం వల్ల వాహనాలు మళ్లీ సిటీలోని భీమారం–-పలువేల్పుల క్రాస్​ వరకు వెళ్లి యూ టర్న్​ తీసుకుని రావాల్సి వస్తోంది. కొద్ది రోజుల వరకు రింగ్  రోడ్డు పక్కనే తులసి గార్డెన్స్​ ఎదురుగా ఓపెన్​ డివైడర్​ ఉండగా.. అక్కడ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ మార్గాన్ని మూసేశారు. దీంతో అక్కడ టర్న్​ తీసుకోవాల్సిన వాహనాలు.. భీమారం వరకు వెళ్లాల్సి వస్తోంది. ఇలా కాదంటే ములుగు వైపు నుంచి వచ్చే వెహికల్స్.. చింతగట్టు వరకు వెళ్లి అక్కడ యూటర్న్​ తీసుకొని సర్వీస్​ రోడ్డు మార్గాన మళ్లీ వరంగల్–-కరీంనగర్  హైవే ఎక్కాల్సి వస్తోంది. 

సిటీలోకి వస్తే ఇబ్బందే

మేడారం జాతరకు హైదరాబాద్​ వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా రింగ్​ రోడ్డు మీదుగా వెళ్లే అవకాశం ఉంది. దీంతో సిటీ మీదుగా వచ్చే వాహనాలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. సిటీలోకి ప్రవేశించిన తరువాత కాజీపేట -ఫాతిమా నగర్​ వద్ద రైల్వే పట్టాల మీదుగా ఉన్న బ్రిడ్జి దాటాల్సి ఉండగా.. అక్కడ తరచూ ట్రాఫిక్​ సమస్యలు ఎదురవుతున్నాయి. 1970లో కట్టిన బ్రిడ్జి ఒక్కటే ఉండగా.. ట్రాఫిక్​ సమస్యల నేపథ్యంలో రూ.78 కోట్లతో పాత బ్రిడ్జికి సమాంతరంగా రెండో ఆర్ఓబీ ప్లాన్  చేశారు.

2018 చివర్లోనే దీని పనులు ప్రారంభం కాగా..  రైలుపట్టాలు వెళ్లే ప్రాంతంలో రెండు వైపులా బ్రిడ్జి స్లాబ్​ వరకు పనులు పూర్తయ్యాయి. ఆ తరువాత రైల్వే క్రాసింగ్​ ప్రాంతంలో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఆ ప్రాంతంలో బ్రిడ్జి పనుల డిజైన్​ను ఆర్ అండ్​ బీ అధికారులు రైల్వే శాఖకు అందించడం, దానిని రైల్వే టెక్నికల్​ ఆఫీసర్లు అప్రూవ్​ చేయడంలో కొంత ఆలస్యమైంది. ఇటీవలే ఆ చిక్కులు తీరినా.. ఆ ప్రాంతంలో నిర్మించే ప్రిఫ్యాబ్రికేషన్​​ స్లాబ్స్, బ్రిడ్జి స్ట్రక్చర్​ తదితర పనులు నడుస్తున్నాయి. దీంతో పనులు కంప్లీట్​ కావడానికి ఇంకో రెండు నెలలైనా పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మేడారం జాతరకు వెళ్లే వాహనదారులు.. ఫాతిమా నగర్​ పాత బ్రిడ్జిపై ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

ఖమ్మం వైపు నుంచి వచ్చే వాహనాలూ సిటీ దాటాల్సిందే

వరంగల్  మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వెహికిల్స్​కు ట్రాఫిక్​ చిక్కులు తప్పించేందుకు ‘కుడా’ ఆధ్వర్యంలో ఇన్నర్​ రింగ్​ రోడ్డు వేయాలని ప్లాన్​ చేశారు. సిట్టీ చుట్టూ దాదాపు 41 కిలోమీటర్ల మేర ఈ ఇన్నర్  రింగ్  రోడ్డు వేయాల్సి ఉండగా.. ఒకవైపు ఎన్ హెచ్​-163లో భాగంగా కరుణాపురం నుంచి దామెర క్రాస్​ వరకు 17 కిలోమీటర్ల మేర నిర్మించిన రోడ్డు.. ఇన్నర్​ రింగ్​ రోడ్డులో భాగమైంది.

అదికాకుండా మరోవైపున ఇన్నర్​ రింగ్​ రోడ్డు మొదటి దశలోనే నాయుడు పెట్రోల్​ పంప్  నుంచి గవిచర్ల క్రాస్, స్తంభంపల్లి, జాన్​పీరీలు, కీర్తినగర్, ఏనుమాముల, పైడిపల్లి, కొత్తపేట, ఆరెపల్లి, దామెర జంక్షన్​ వరకు రోడ్డు నిర్మించేందుకు కసరత్తు చేశారు. కొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఇన్నర్​ రింగ్​ రోడ్డు నిర్మాణానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

ఫలితంగా ఖమ్మం వైపు నుంచి మేడారం వెళ్లాల్సిన వెహికిల్స్  రంగశాయిపేట, బట్టల బజార్, వరంగల్ ఎంజీఎం సెంటర్, ములుగు రోడ్డు మీదుగా దామెర క్రాస్​ వద్ద ఎన్​హెచ్​-163 ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సిటీలో వాహనాలతోనే ట్రాఫిక్​ జామ్​లు ఏర్పడుతుండగా..  మేడారం జాతర ప్రారంభమైతే మరిన్ని చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. దీంతో నగరంలో ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.