
ప్రయాగ్ రాజ్: వరదల కారణంగా ఉత్తరప్రదేశ్లో సంభవించిన జల ప్రళయం కాశీలో జరిగే దహన సంస్కారాలపై తీవ్ర ప్రభావం చూపింది. కాశీలోని మణికర్ణిక ఘాట్లో రోజుకు పదుల సంఖ్యలో అంత్యక్రియలు జరుగుతుంటాయి. పాడె మీద శవాలు, చితి మంటలు, అఘోరీలతో కనిపించే మణికర్ణిక ఘాట్లో అంతిమ సంస్కారాలకు ఈ వరదల కారణంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాశీలో దహన సంస్కారాలు జరిగితే మోక్షం దక్కుతుందని భావించి చనిపోయిన వ్యక్తులను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అక్కడికి తీసుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు.
కట్టెలపై శవాలు కాలుతుండే మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతిమ సంస్కారాలు నిర్వహించే ఘాట్స్ను, వారణాసిలోని మెజారిటీ ప్రాంతాలను వరదల కారణంగా గంగా నది ముంచేసింది. దహన సంస్కారాలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఆరు ఘాట్స్ మోకాలి లోతు నీళ్లలో మునిగిపోయాయి. రెండు ఘాట్స్లో మాత్రమే దహన సంస్కారాలకు అవకాశం ఉండటంతో ఆ ఘాట్స్కు వచ్చే వీధుల్లో పడవల్లో శవాలు కనిపిస్తున్నాయి.
అంతిమ యాత్రలను ముగించుకుని పాడెతో సహా శవాలను పడవల్లోకి ఎక్కించేసి గంటల కొద్దీ నిరీక్షిస్తున్న దృశ్యాలు వారణాసి వీధుల్లో కనిపిస్తున్నాయి. రెండు ఘాట్స్లో దహన సంస్కారాలకు నాలుగైదు గంటలకు పైగానే పడుతుండటంతో శవాలతో ఆ వరద నీళ్లలోనే వేచి చూస్తున్నారు. ఘాట్లో కూడా కింద దహన సంస్కారాలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో అక్కడ ఉన్న సత్రాల పైన కట్టెలు పేర్చి దహన సంస్కారాలు నిర్వహిస్తున్న దృశ్యాలు కనిపించాయి. మరణించిన వారిని హరిశ్చంద్ర ఘాట్లో దహనం చేస్తారు. అక్కడే హరిశ్చంద్రుడు కాటికాపరిగా వుండేవాడని నమ్మకం. హరిశ్చంద్రుడు ప్రతిష్టించిన శ్మశాన ఈశ్వరుడు అక్కడ కనిపిస్తాడు.