
బాలీవుడ్ వెబ్ షో 'షోస్టాపర్' దర్శక-నిర్మాత మనీష్ హరిశంకర్‌కి నటి దిగంగనా సూర్యవంశీ పరువు నష్టం నోటీసు పంపింది. నిర్మాతపై పలు సెక్షన్ల కింద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీడియా కథనాల ప్రకారం, దిగంగన నిర్మాతపై 420, 406, 509, 499, 500, 503, 506, 63, 199, 211 సెక్షన్ల కింద ఫిర్యాదు చేశారు.
తప్పుడు వాగ్దానాలు చేసి తన టీమ్ నుండి దిగంగనా డబ్బులు తీసుకున్నారని గతంలో మనీష్ హరిశంకర్ ఆరోపించారు. అంతేకాదు..చీటింగ్, నమ్మక ద్రోహం చేసిందని.. ఐపీసీ సెక్షన్ 420, సెక్షన్ 406 కింద ఆమెపై షో నిర్మాణ సంస్థ MH ఫిల్మ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిర్మాతపై దిగంగనా న్యాయపోరాటానికి దిగింది.
ఈ క్రమంలో స్పందించిన దిగంగనా.. " మనీష్ హరిశంకర్ తనపై చేసిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసింది. ఇది మనీష్ విచిత్రమైన ఊహ.. అతను చేసిన ఆరోపణలన్నీ అబద్ధం. చీప్ పబ్లిసిటీ స్టంట్. అతను బలిపశువును చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. రెండు సంవత్సరాలు దాటినా ఆతన వెబ్ షోను విడుదల చేయలేకపోయారు. దీనిపై మరింత వివరించడానికి నా సమయం వృధా చేయకూడదనుకుంటున్నాను. నేను ఇప్పటికే అతనికి సహాయం చేయడానికి చాలా సమయం వృధా చేశాను" అని అన్నారు.
వ్యాపార ఒప్పందం ప్రకారం 'షోస్టాపర్'కు ప్రెజెంటర్‌గా రావడానికి అక్షయ్ కుమార్ ఆమోదం తీసుకున్నారని.. కానీ, దానిని మనీష్ నెరవేర్చలేదని దిగంగనా తరపు న్యాయవాది వెల్లడించారు. దిగంగనాపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని ఆమె లాయర్ చెప్పారు. కాగా, ఆర్థిక సంక్షోభం కారణంగా 'షోస్టాపర్' ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు తెలుస్తోంది.