ఫేక్ డాక్యుమెంట్లతో డిజిటల్ లోన్లు

ఫేక్ డాక్యుమెంట్లతో డిజిటల్ లోన్లు
  • పెరుగుతున్న ఫేక్​ లోన్లు
  • మరింత ఎక్కువైన కార్డ్ ఫ్రాడ్​లు
  • భారీగా వెలుగుచూస్తున్న ఐడెంటిటీ థెఫ్ట్​లు..

న్యూఢిల్లీ: మొబైల్​ యాప్​తో లోన్లు ఇచ్చే డిజిటల్​ లెండర్లు కిస్తీలు కట్టని వారిని విపరీతంగా సతాయించడంతో భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో ఆర్​బీఐ కొన్ని కొత్త రూల్స్​ తేవాల్సి వచ్చింది. ఇప్పుడు వీటితో మరో సమస్య వచ్చిపడింది. ఈ యాప్​ల ద్వారా ఫేక్ డాక్యుమెంట్లతో చాలా మంది లోన్లు తీసుకుంటున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది సామాన్యులే ఉంటున్నారు. బాధితులకు సంబంధించిన కీలకమైన వ్యక్తిగత సమాచారం లీక్ కావడంతో వేరే వాళ్లు వీరి పేరుతో లోన్లు తీసుకోగులుగుతున్నారు. ఆర్​బీఐ వంటి రెగ్యులేటర్లు ఈ సమస్యపై ఆందోళన చెందుతున్నాయి. తాజాగా ధనిలోన్స్ యాప్​ ద్వారా ఇలాంటివి చాలా జరిగాయి. ఇండియాబుల్స్​ గ్రూపునకు చెందిన ఈ లెండర్​ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు తమ డాక్యుమెంట్లతో లోన్లు తీసుకున్నారని చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అసలు ఇంతకూ ఇలా ఎందుకు జరుగుతుందో... ఏం జరగాల్సి ఉందో తెలుసుకుందాం. 

ధనిలో ఏం జరిగింది ?
గుర్తుతెలియని వ్యక్తులు తమ పాన్​కార్డు నంబర్లు ఉపయోగించి లోన్లు తీసుకున్నారని గత కొన్ని రోజులుగా ధనీకి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయి. లోన్​ కిస్తీలు కట్టాలంటూ తమకు షోకాజు నోటీసులు వచ్చాయని, ఏజెంట్లు వేధిస్తున్నారని కూడా బాధితులు చెబుతున్నారు. ఈ లోన్లతో తమకు సంబంధమే లేదని అంటున్నారు. మరో సమస్య ఏంటంటే ఈ లోన్ల కిస్తీలు కట్టకపోవడం వల్ల పాన్​కార్డు హోల్డర్ల క్రెడిట్​స్కోర్లు తగ్గుతున్నాయి. డేటా చోరీ, ఫైనాన్షియల్​ మోసాలు చిన్న విషయాలు కావు. ఇతరుల డాక్యుమెంట్లతో లోన్లు తీసుకోవడం చాలా పెద్ద నేరం కూడా. కిస్తీలు జమ కాకపోవడంతో ఏజెంట్లు పాన్​కార్డు హోల్డర్లను వెంటాడుతున్నారు. దీంతో అసలు సమస్య వెలుగులోకి వచ్చింది. కొందరు బాలీవుడ్​ ప్రముఖుల పేరిట కూడా మోసగాళ్లు లోన్లు తీసుకున్నారు. 

ధని ఏమంటోంది ?
‘‘కొందరు మోసగాళ్లు దొంగ లోన్లు తీసుకున్నట్టు కంప్లయింట్లు అందిన మాట నిజమే. మేం బాధితులతో మాట్లాడుతున్నాం. వారి వివరాలు తీసుకుంటున్నాం. ఐడెంటిటీ చోరీ జరిగిందా లేదా ? అని నిర్ధారించుకుంటున్నాం. ఫేక్​ లోన్ల సమాచారాన్ని క్రెడిట్​బ్యూరోలకు ఇస్తున్నాం. మోసగాళ్లు కస్టమర్లతోపాటు కంపెనీలనూ మోసం చేస్తున్నారు. ఇక నుంచి ఇటువంటివి జరగకుండా పటిష్టమైన సిస్టమ్స్​ను తీసుకొస్తున్నాం. కొందరు ఓటీపీ, పాస్​వర్డ్స్​ చెప్పడం వల్ల మోసపోయారు”అని ధని విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మోసగాళ్లను, తప్పుడు పత్రాలను గుర్తించడానికి ధని ‘జీ–డిఫెన్స్​’ అనే గ్లోబల్​ సెక్యూరిటీ ఫర్మ్​తో కలసి పనిచేసినా మోసాలు ఆగలేదు. పాన్​కార్డు వివరాలు, ఇతర డాక్యుమెంట్లు లీకయ్యాయి. 

ఇతర కంపెనీల్లోనూ..
ధనిలో మాత్రమే కాదు ఇతర సంస్థల్లోనూ ఫైనాన్షియల్​ ఫ్రాడ్స్​ జరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా తరువాత వీటి సంఖ్య పెరిగింది. 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021లో మోసపూరిత డిజిటల్​ ట్రాన్సాక్షన్ల సంఖ్య 28.32 శాతం పెరిగిందని ‘ట్రాన్స్​యూనియన్​’ రిపోర్టు వెల్లడించింది. ముంబై, ఢిల్లీ, చెన్నైలలో ఇట్లాంటి కేసులు ఎక్కువ ఉన్నాయని తెలిపింది. డెబిట్​/క్రెడిట్​కార్డుల మోసాలు విపరీతంగా జరుగుతున్నాయని ఏసీఐ వరల్డ్​వైడ్​ అనే సాఫ్ట్​వేర్​ కంపెనీ తెలిపింది. రియల్​ టైం పేమెంట్స్ స్కామ్స్​ కూడా ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2019 నుంచి 2020 మధ్య రియల్ ​టైం పేమెంట్స్​ స్కాములు 12.5 శాతం నుంచి 13.7 శాతం పెరిగాయి. ఐడెండిటీ థెఫ్ట్​ కేసులు ఆరు శాతం నుంచి 11.6 శాతం, డిజిటల్​ వాలెట్​ అకౌంట్​ హ్యాక్స్​ 4.4 శాతం నుంచి 6.2 శాతం పెరిగాయని పేర్కొంది. బ్యాంక్​ ఫ్రాడ్స్​ 25 శాతం పెరిగాయని ఆర్​బీఐ ప్రకటించింది. ఇటువంటి మోసాలకు అడ్డుకట్టవేయడానికి లెండర్లు ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకుంటూ టెక్నాలజీని అప్​గ్రేడ్​ చేయడం ఒక్కటే మార్గమని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.