
- ఇప్పటికే మొదలైన ఆఫ్‌లైన్ స్పాట్
- అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నుంచి డిజిటల్ వాల్యుయేషన్ ప్రారంభించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్లో ఆన్సర్ షీట్ల డిజిటల్ వాల్యుయేషన్‌పై ఇంకా అయోమయమే కొనసాగుతోంది. ఇప్పటికే ఆఫ్‌లైన్ లో స్పాట్ వాల్యుయేషన్మొదలు కాగా, ఆన్లైన్ వాల్యుయేషన్ప్రాసెస్ ప్రారంభం కాలేదు. ఈ ఏడాది నుంచే ఆన్లైన్ వాల్యుయేషన్ చేపడతామని ఇంటర్ బోర్డు పలుమార్లు ప్రకటించింది. దీంతో ఈసారి ఆన్లైన్, ఆఫ్‌లైన్ వాల్యుయేషన్ రెండూ నిర్వహిస్తారా ? అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నుంచి డిజిటల్ వాల్యుయేషన్ ప్రారంభిస్తారా? అనే దానిపై క్లారిటీ రాలేదు. ఇప్పటికిప్పుడు దీనిపై నిర్ణయం తీసుకున్నా... టెండర్ నోటీసుల్లో పేర్కొన్నట్టు వాల్యుయేషన్ నిర్వహించే చాన్స్ లేదని అధికారులు అంటున్నారు. దీంతో ఒకటి, రెండు మైనర్ సబ్జెక్టుల్లోనే డిజిటల్ వాల్యుయేషన్ చేయాలని యోచిస్తున్నారు. అయితే టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీ ఘటన నేపథ్యంలో ఇందుకు సర్కారు పర్మిషన్ ఇస్తుందా ? లేదా ? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.
‘కోసైన్’కు ఆన్లైన్ వాల్యుయేషన్ టెండర్లు
రాష్ట్రంలో ఈనెల15 నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు వచ్చేనెల 4 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 9.47 లక్షల మంది స్టూడెంట్స్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇప్పటికే లాంగ్వేజెస్‌తో సహా ఆరు పరీక్షలు పూర్తయ్యాయి. అయినా, వాల్యుయేషన్ ప్రక్రియపై ఇంటర్ బోర్డు పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోలేదు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా స్పాట్ వాల్యుయేషన్చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. 14 వాల్యుయేషన్ సెంటర్లలో ఏర్పాట్లతో పాటు అధికారుల రిక్రూట్ మెంట్ కూడా పూర్తయింది. బుధవారం నుంచి సంస్కృతం ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ ప్రారంభమైంది. మరోవైపు డిజిటల్ వాల్యుయేషన్ టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
రెండోసారి నిర్వహించిన టెండర్లలో మాగ్నటిక్, కోసైన్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. కోసైన్ లిమిటెడ్ సంస్థకు ఆన్లైన్ వాల్యుయేషన్ టెండర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. తొలిసారి నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో ఒక్క సంస్థే పాల్గొనడంతో దాన్ని రద్దు చేశారు. ఈసారి సైన్స్ సబ్జెక్టులు మినహా లాంగ్వేజెస్, హ్యుమానిటీస్, ఒకేషనల్ సబ్జెక్టులన్నీ కలిపి 35లక్షల ఆన్సర్ షీట్లను డిజిటల్ వాల్యుయేషన్ చేస్తామని ఇంటర్ బోర్డు అధికారులు గతంలో వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏర్పాట్లు చేయకపోవడంతో.. ఈసారి డిజిటల్ వాల్యుయేషన్ లేకపోవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం ఈసారి ఒకటి, రెండు ఒకేషనల్ సబ్జెక్టుల్లోనైనా ఇది అమలు చేయాలనే పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. ఈమేరకు సర్కారుకు ప్రతిపాదనలు పంపారని తెలుస్తోంది. ఇంటర్ బోర్డు చైర్మన్ గా ఉన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీన్ని ఖరారు చేయాల్సి ఉంది.