సంక్రాంతి రేసులో గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్, ఈగల్, హనుమాన్ చిత్రాలు పోటీపడుతున్నాయి. వీటిలో ఏది వెనక్కు తగ్గుతుందా అనే విషయంపై కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయంపై ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు వివరణ ఇచ్చారు. ‘ప్రతి సంక్రాంతికి మూడు నుంచి నాలుగు చిత్రాలు రావడం కామన్.
కానీ ఇప్పుడు ఐదు సినిమాలు రావడంతోనే సమస్య వచ్చింది. ఆ ఐదుగురు నిర్మాతలను పిలిచి ఫిల్మ్ చాంబర్‌లో చర్చించాం. ఒకరిద్దరు వెనక్కి వెళితే మిగతా సినిమాలకు కంఫర్ట్‌బుల్‌గా థియేటర్స్ దొరుకుతాయని అనుకున్నాం. ఇప్పటికే నా సినిమా (ఫ్యామిలీ స్టార్)ను వాయిదా వేసుకున్నా కాబట్టి.. నేను లీడ్ చేస్తే బాగుంటుందని ఆ చిత్ర నిర్మాతలు కోరుకున్నారు.
అలాగే చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా అడుగుతున్నారు. అందుకే సంక్రాంతికి ఎవరైనా డేట్ చేంజ్ చేసే ఆలోచనతో ముందుకొస్తే వారికి సోలో డేట్ ఇచ్చేందుకు చాంబర్ ప్రయత్నిస్తోంది. రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి సినిమా వస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయనే ఆశలో మేము బ్రతుకుతాం. అందుకే ప్రతీ నిర్మాత సంక్రాంతికి రావాలనుకుంటాం. నాకున్న ఎక్స్‌పీరియెన్స్‌తో నా సినిమాను సమ్మర్‌కు షిఫ్ట్ చేసుకున్నా.
అన్ని సినిమాలకు ఎప్పటికీ న్యాయం జరగదు. ఎవరో ఒకరికి తక్కువ థియేటర్స్ వస్తాయి. ఐదుగురు రాకుంటే బాగుంటుందని మా ఆలోచన. ఆర్ఆర్ఆర్, సలార్ సినిమాలు ఎన్నిసార్లు పోస్ట్ అయినా కలెక్షన్స్ ఇరగదీస్తున్నాయి’ అని చెప్పారు. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దిల్ రాజు మాట్లాడారు. ఈ అకాడమీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ వేడుకలను జనవరి 21న హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించబోతున్నారు.
