చర్చలు పూర్తయ్యాకే షూటింగ్స్‌ మొదలు

చర్చలు పూర్తయ్యాకే షూటింగ్స్‌ మొదలు

థియేటర్లలో విడుదలైన 8 వారాల (50 – 56 రోజులు) తర్వాతే సినిమా ఓటీటీలో విడుదలయ్యేలా నిర్మాతలమంతా ఏకగ్రీవంగా నిర్ణయించామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ఇవాళ ఫిలిం చాంబర్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. గత 18 రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్‌ బంద్‌కు త్వరలో శుభం కార్డు పడుతుందన్నారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి 33 మందితో కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలు, కమిటీల పురోగతిని దిల్ రాజు వివరించారు. ‘అతి త్వరలో షూటింగ్ మొదలుపెట్టేలా ముందుకెళ్తున్నాం అన్నారు. దీనిపై గత 18 రోజులుగా నిర్మాతలంతా కమిటీలు వేసుకుని చర్చిస్తున్నామన్నారు. సినిమా థియేటర్స్‌లో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదలయ్యేలా ఏకగ్రీవంగా నిర్ణయించామన్నారు. టికెట్ రేట్లు, ఫుడ్ అండ్ బేవరేజెస్‌ను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచేందుకు మల్టిప్లెక్స్‌ యాజమాన్యాలు అంగీకరించాయన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్, వీఫీఎఫ్‌ ఛార్జెస్‌కు సంబంధించిన అంశాలపై చర్చలు ఇంకా జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం దీనిపై చర్చించనున్నట్లు చెప్పారు. 

మరో మూడు రోజుల పాటు ఆ చర్చలు

కాస్ట్‌ ఆఫ్ ప్రొడక్షన్, షూటింగ్‌లో వేస్టేజ్‌ తదితర విషయాలపై ఫిలిం చాంబర్, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగిందని దిల్ రాజు వెల్లడించారు. ఇదో గొప్ప అచీవ్‌మెంట్.. నిర్మాతలు అడిగిన అంశాలపై ‘మా’ అసొసియేషన్‌ ఈసీ మీటింగ్‌లో చర్చించుకుని నిన్న (బుధవారం) అగ్రిమెంట్ చేశారు. దర్శకులు, ఇతర టెక్నీషియన్స్‌తోనూ వరుస మీటింగ్స్ జరుగుతున్నాయని అన్నారు. అక్కడ కూడా అనవసర వ్యయాలను నియంత్రించే విధంగా ముందుకెళ్తున్నాం. మరో మూడు రోజుల పాటు ఆ చర్చలు జరగనున్నాయి. ఫెడరేషన్‌తో చర్చలు దాదాపు ముగిసాయన్నారు. వాళ్లు అడుగుతున్న వేతనాలతో ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని సమస్యల పరిష్కారానికి దాదాపు రీచ్ అయ్యాం అన్నారు. వర్కింగ్ కండిషన్స్‌ విషయంలో కొన్ని చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు. అవి మరో రెండు రోజుల్లో కంక్లూజన్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చర్చలన్నీ పూర్తయ్యాకే షూటింగ్స్‌ మొదలుపెడతాని చెప్పారు. 

సౌత్‌ ఇండస్ట్రీస్‌ టాలీవుడ్‌ను పరిశీలిస్తున్నాయి

షూటింగ్స్ శుక్రవారం నుంచే ప్రారంభం అవుతాయనే ప్రచారం జరుగుతోంది.. అది నిజం కాదని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్స్ తిరిగి ఎప్పుడు మొదలుపెడతాం అనేది త్వరలోనే మళ్లీ మీడియా ముందుకొచ్చి తెలియజేస్తామన్నారు. బాలీవుడ్‌తో పాటు సౌత్‌ ఇండస్ట్రీస్‌ అన్ని టాలీవుడ్‌ను పరిశీలిస్తున్నాయని అన్నారు. ఇక్కడ మేము తీసుకునే నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఆ ఇండస్ట్రీస్‌ అన్నీ సిద్ధంగా ఉన్నాయిని దిల్ రాజు అన్నారు. ఇక, ఈ ప్రెస్‌మీట్‌లో ఫిలిం చాంబర్‌‌ ప్రెసిడెంట్ బసిరెడ్డి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్​, సెక్రట‌రీ టి.ప్రస‌న్నకుమార్‌, నిర్మాతలు దామోదర ప్రసాద్, అభిషేక్ నామా, స్రవంతి రవి కిషోర్, రవి శంకర్ యలమంచిలి తదితరులు పాల్గొన్నారు.