కార్తికేయ 2 రిలీజ్ డేట్ నా వల్లే మారింది

కార్తికేయ 2 రిలీజ్ డేట్ నా వల్లే మారింది

కార్తికేయ 2 మూవీ విడుదలకు సంబంధించి తనపై వస్తున్న విమర్శలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. కార్తికేయ2 సక్సెస్ మీట్ కు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి కార్తికేయ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన టీంను దిల్ రాజు అభినందించారు. ఆగస్టు నెల తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపు తీసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కార్తికేయ 2 సినిమా రిలీజ్ కి సంబంధించిన కొన్ని విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. 

రిలీజే డేట్ మార్చమని అడిగా
కార్తికేయ మూవీ టీంకు తమకు మధ్య హెల్తీ రిలేషన్ ఉందని దిల్ రాజు స్పష్టం చేశారు. సినిమా రిలీజ్ డేట్ మార్చమని తానే ఫోన్ చేసి అడిగానని, అందుకు వారు ఒప్పుకున్నారని చెప్పారు. అయితే బయట మాత్రం ఈ విషయం నెగిటివ్ గా స్ప్రెడ్ అయిందని వాపోయారు. సబ్ స్క్రైబర్స్, ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ఎవరికి నచ్చినట్లు వాళ్లు రాసేశారని విమర్శించారు. వార్తలు రాసే ముందు తెలుసుకొని రాయండి లేదంటే మూసుకోండని వార్నింగ్ ఇచ్చారు. నిజానికి కార్తికేయ 2 ప్రీ రిలీజ్ కు రావాల్సి ఉండగా.. జ్వరం కారణంగా రాలేకపోయానని దిల్ రాజు చెప్పారు. ఒక వార్త రాసేటప్పుడు కామన్ సెన్స్ ఉపయోగించాలని, ఏం జరిగిందో తెలుసుకుని రాయాలని సూచించారు. నిజా నిజాలు తెలుసుకోకుండా ఎదుటి వాళ్ల మీద రాళ్లు వేయడం సరికాదని అన్నారు. తాను తప్పు చేయనన్న దిల్ రాజు.. సినిమా తన ప్రాణమని, దాని కోసం ప్రాణమిస్తానని అన్నారు. 

థాంక్యూ కోసం.. 
వాస్తవానికి కార్తికేయ 2 జూలై 22వ తేదీన ప్రేక్షకుల వచ్చేందుకు సిద్ధమైంది. అయితే అదే సమయంలో దిల్ రాజు నిర్మాతగా నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా విడుదలైంది. దీంతో కార్తికేయ 2కు థియేటర్లు దొరకకపోవడంతో విడుదల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ‘కార్తికేయ 2’ నిర్మాతలు రిలీజ్ కోసం చాలా తిప్పలు పడ్డా.. దిల్ రాజు బలం ముందు వీరి బలగం సరిపోలేదన్న విమర్శలు వచ్చాయి. ఫలితంగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కార్తికేయ 2ను మిగతా భాషల్లోనూ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ సినిమా ప్రమోషన్స్ కోసం బాగా ఖర్చు పెట్టడంతో దిల్ రాజు కారణంగా అదంతా వృథా అయిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. 

మాచర్ల కోసం మరోసారి వాయిదా
ఇక ఆగస్టు 12 శుక్రవారం కార్తికేయ 2 రిలీజ్ కు చిత్ర బృందం మరోసారి ముహూర్తం ఖరారు చేసుకుంది. అయితే ఆగస్టు 5న దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న బింబిసార రిలీజ్ కాగా.. 12న నైజాంలో దిల్  రాజు పంపిణీ చేస్తున్న నితిన్ మూవీ మాచర్ల నియోజకవర్గం విడుదలైంది. బింబిసార హిట్ కావడంతో చాలా థియేటర్స్ ఆ సినిమాను రెండోవారం కొనసాగించాయి. ఇక మిగిలిన వాటిలో మెజార్టీ థియేటర్స్ ను మాచర్ల నియోజకవర్గం కోసం కేటాయించారు. దీంతో దిల్ రాజు కారణంగానే నిఖిల్ సినిమాకు ప్రైమ్ థియేటర్స్ దొరకటం కష్టమైపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కారణంగానే కార్తికేయ 2 సినిమాను శుక్రవారానికి బదులుగా ఆగస్టు 13 శనివారం రిలీజ్ చేయాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కార్తికేయ 2 సక్సెస్ మీట్ కు హాజరైన దిల్ రాజు తనపై వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.