వీడియో: కాంట్రాక్టర్ మీద చెత్త, బురద వేయించిన ఎమ్మెల్యే

వీడియో: కాంట్రాక్టర్ మీద చెత్త, బురద వేయించిన ఎమ్మెల్యే

ఏ కాంట్రాక్టర్ అయినా ప్రభుత్వ పనులు సరిగాచేయకపోతే ప్రజాప్రతినిధులు ప్రశ్నించడం.. ఆ కాంట్రాక్టర్‌కు రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో పెట్టించడం కామన్. కానీ ఇక్కడో ఎమ్మెల్యే.. కాంట్రాక్టర్ సరిగా పని చేయలేదని ఊహించని విధంగా శిక్షించాడు. గత వారం నుంచి ముంబైలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ముంబై వీధులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా డ్రైనేజీతో రోడ్లన్నీ కంపుకొడుతున్నాయి.

ఈ క్రమంలో ముంబైలోని చాందివాలి నియోజకవర్గ శివసేన పార్టీ ఎమ్మెల్యే దిలీప్ లాండే.. వర్షం వల్ల ఏర్పడిన పరిస్థితులను తెలుసుకునేందుకు వీధుల్లో పర్యటించారు. ఓ డ్రైనేజీ వద్ద చెత్త పేరుకుపోయి.. నీళ్లన్నీ స్ట్రక్ అయ్యాయి. దాంతో ఎమ్మెల్యే వెంటనే కాంట్రాక్టర్‌ను పిలిపించాలని అధికారులకు సూచించాడు. కాసేపట్లో అక్కడికొచ్చిన కాంట్రాక్టర్‌పై దిలీప్ లాండే ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్డు పనులు సరిగా చేయకపోవడం వల్ల డ్రైనేజీ మొత్తం స్తంభించిపోయిందని.. మీ వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంట్రాక్టర్‌ను మందలించాడు. అంతటితో ఆగకుండా.. వరద నీళ్లలో... డ్రైనేజీ పక్కన కాంట్రాక్టర్‌ను కూర్చోపెట్టాడు. అతడిపై మున్సిపల్ సిబ్బందితో చెత్త, బురద, డ్రైనేజీ నీళ్లు పోయించి.. నడిరోడ్డుపైనే అటు జడ్జిమెంట్, ఇటు పనిష్మెంట్ ఇచ్చేశాడు. కాంట్రాక్టర్ తన పని సరిగ్గా నిర్వహించనందుకే ఇలా చేశానంటూ దిలీప్ లాండే తన పనిని సమర్థించుకున్నారు.