గుండె పగిలిన డిండి రైతు

గుండె పగిలిన డిండి రైతు
  • నేటికీ రైతులకందని పరిహారం
  • ఆందోళనతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు

నాగర్​కర్నూల్, వెలుగు: మూడు జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాలకు సాగు నీరందించే డిండి ప్రాజెక్టు పనులు మూలకు పడ్డాయి. ఈ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు పరిహారం కోసం ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. భూ సేకరణ సమయంలో నెల రోజుల్లో పరిహారం, డబుల్​బెడ్ రూం ఇండ్లు, ఉద్యోగం గ్యారెంటీ అన్న నాయకులు పత్తా లేకుండా పోయారు. భూసేకరణ నోటిఫికేషన్​ఇవ్వడానికి ముందే రైతులను ఒప్పించి మూడు పంటలు పండే భూముల్లో తోటలు, మోటా ర్లు, పైపులైన్లు, బోర్లు పీకేసి కాలువలు తవ్వారు. తోడిన మట్టిని ఖాళీ భూముల్లో గుట్టలుగా పోశారు. ఎకరాకు రూ.5.5 లక్షలు వస్తాయి కదా అని కొందరు రైతులు ఆడపిల్లల పెళ్లిళ్లు పెట్టుకున్నారు. మరికొందరు పక్క ఊర్లలో భూములకు అడ్వాన్సు ఇచ్చారు. సర్కారు భూములు తీసుకుని మూడేళ్లు గడుస్తున్నా పరిహారం డబ్బులు చేతికందకపోవడంతో గుండె ఆగి ఇద్దరు కన్ను మూశారు. ఆందోళనతో  మరికొందరు అనారోగ్యం బారిన పడ్డారు. 
2015లో శంకుస్థాపన
రూ.6,190 కోట్ల అంచనా వ్యయంతో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు 2015 జూన్ 2న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 3.6 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్​నగరానికి తాగునీరు అందించాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. పాలమూరు – -రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్​రిజర్వాయర్​నుంచి 92 కి.మీ. ప్రధాన కాలువ,7 కి.మీ. అండర్​టన్నెల్, రిజర్వాయర్లు ప్రతిపాదించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఎర్రవెల్లి, గోకారం వద్ద ఒక రిజర్వాయర్, రంగారెడ్డి జిల్లా ఆర్కపల్లి వద్ద మరో రిజర్వాయర్, సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టంపల్లి, శివన్న గూడెం వద్ద రిజర్వాయర్ల పనులు చేపట్టారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్​పనులను మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. ఐతే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం భారీగా భూములు సేకరించింది. ఇందులో ఎక్కువగా ముంపునకు గురయ్యేది నాగర్ కర్నూల్ జిల్లా రైతులే.  నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 1,673 ఎకరాలు సేకరించారు. 
1300 ఎకరాలకు పరిహారం ఇయ్యలే
నాగర్​ కర్నూల్​జిల్లాలోని  వంగూరు, చారకొండ, వెల్డండ మండలాల్లో 1,300 ఎకరాలకు రూ.70 కోట్ల పరిహారం నేటికీ అందలేదు. 2021 మార్చి బడ్జెట్​లో నిధులు కేటాయించి రైతులకు టోకెన్లు కూడా ఇచ్చారు. ఫండ్స్​రిలీజ్​చేయక టోకెన్లు ల్యాప్స్​అయ్యాయి. మల్లన్నసాగర్​ మాదిరిగా కాకపోయినా నిజామాబాద్​జిల్లాలో ఇచ్చిన విధంగా ఎకరాకు రూ. 8లక్షల వరకు ఇచ్చేలా సీఎంతో మాట్లాడుతానని మాటిచ్చిన అప్పటి నీళ్ల మంత్రి హరీశ్​రావు మళ్లీ నోరు విప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ఉల్పర నుంచి గోకారం మధ్యలో ఉండే గ్రామాల రైతులకు మూడేళ్లుగా నరకం చూపిస్తున్నారు. గోకారం రిజర్వాయర్​లో ముంపునకు గురయ్యే గ్రామాల్లో కనీసం తాగడానికి నీటి వసతి కల్పించకుండా వదిలేశారు. ముంపునకు గురయ్యే ఊర్లకు రోడ్లెందుకు, నీళ్లేందుకు అన్నట్లుగా అధికారులు వదిలేశారు. రిజర్వాయర్​ కోసమని 600 ఎకరాల విస్తీర్ణంలో ఉండే చెరువు కట్ట తెంపేశారు. పశువులు మేపేందుకు గడ్డి దొరకని గతికి తెచ్చారని భూములు కోల్పోయిన గ్రామాల రైతులు అంటున్నారు. ఇప్పుడు సర్కారు ఇచ్చే రూ.5.5 లక్షలతో కనీసం ప్లాట్​ కూడా రాదని వాపోతున్నారు.