
రాజ్‌కోట్: దాదాపుగా కెరీర్ ముగిసిందనుకున్న దశలో తిరిగి టీమిండియా చోటు దక్కించకుని ఓ రేంజ్లో ఆడుతున్న వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్‌పై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. కార్తీక్ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడని కొనియాడాడు. శుక్రవారం సౌతాఫ్రికాతో నాలుగో టీ20 గెలిచిన తర్వాత బీసీసీఐ టీవీ కోసం కార్తీక్‌తో హార్దిక్ ముచ్చటించాడు. ‘కార్తీక్ నువ్వు చాలా మందికి ప్రేరణ. చాలా మంది నిన్ను విమర్శించిన రోజుల్లో, టీమ్‌లో నువ్వు లేనప్పుడు నాతో చేసిన చాట్ నాకు ఇంకా గుర్తుంది. ఎప్పటికైనా టీమిండియాకు ఆడటమే నీ లక్ష్యమని చెప్పావు. దాని కోసం సర్వస్వం ఇస్తానని అన్నావు. ఇప్పుడు నువ్వు మళ్లీ టీమ్‌లోకి రావడం నిజంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. నిన్ను చూసి మేం చాలా నేర్చుకోవాలి’ అని హార్దిక్ వ్యాఖ్యానించాడు.