దినేష్ కార్తీక్ ఎమోషనల్ వీడియో..రిటైర్మెంట్కు సంకేతమా..?

దినేష్ కార్తీక్ ఎమోషనల్ వీడియో..రిటైర్మెంట్కు సంకేతమా..?

దినేష్ కార్తీక్ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నాడా..? అతను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడా..? డీకే ఇక టీమిండియా జెర్సీని ధరించబోడా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పడిలేచిన కెరటంలా జట్టులోకి వచ్చిన దినేష్ కార్తీక్.. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్ కప్ 2022లో చోటు దక్కించుకున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్లో డీకే ఆశించిన స్థాయిలో రాణించలేదు. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత డీకేను న్యూజిలాండ్, బంగ్లా టూర్లకు బీసీసీఐ ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో డీకే క్రికెట్ కెరీర్ ముగిసిందన్న చర్చ తెరపైకి వచ్చింది.  తాజాగా ఇన్స్టాగ్రామ్లో దినేష్ కార్తీక్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. 

ఎమోషనల్ వీడియోలో ఏముంది?

దినేష్​ కార్తీక్ పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం ఫ్యాన్స్ను షాక్కు గురిచేస్తోంది. తన ఇన్స్టాగ్రామ్లో డీకే పోస్ట్ చేసిన ఈ వీడియోపై అభిమానులు, క్రికెట్ నిపుణులు భిన్నంగా చర్చించుకుంటున్నారు.  ఈ వీడియోలో కార్తీక్ తన టీమ్ మేట్స్, కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోలున్నాయి. దీనికి తోడు గ్రౌండ్లో ఆడుతున్న ఫొటోలు వీడియోలో కనిపించాయి. అయితే ఒక విధమైన స్యాడ్ మ్యూజిక్తో ఈ ఫోటోలను జతచేసిన వీడియోను డీకే పోస్ట్ చేశాడు.  ‘డ్రీమ్ డూ కమ్ ట్రూ’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. టీ20 వరల్డ్ కప్ అని రాశాడు. వరల్డ్ కప్లో టీమిండియాకు ఆడటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. టైటిల్ గెలవకపోయినా.. జ్ఞాపకాలు మాత్రం తనకు ఆనందాన్నిస్తాయని చెప్పాడు. తనకు మద్దతు తెలిపిన ఆటగాళ్లు, కోచ్‌లు, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను  అని కార్తీక్ తెలిపాడు. దీంతో దినేష్‌ కార్తీక్‌ త్వరలో  క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. 

నో ప్లీజ్...

డీకే పోస్ట్ చూసిన అభిమానులు షాక్కు గురవుతున్నారు. రిటైర్మెంట్ ప్రకటించొద్దు కార్తీక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ కార్తీక్ అని ఇన్ స్టాలో పోస్టులు పెడుతున్నారు. టీమిండియాకు నీ అవసరం ఉందని చెబుతున్నారు. 

కార్తీక్ కెరీర్..

2004లో టీమిండియాకు తొలిసారి ఎంపికైన దినేష్ కార్తీక్...2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ధోని రెగ్యులర్ కీపర్ గా సెటిల్ కావడంతో..కార్తీక్ కు పెద్దగా అవకాశాలు లభించలేదు. అడపాదడపా మ్యాచ్ లు ఆడాడు. ఇక  2019లో ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్ కప్ కు ఎంపికైనా తుది జట్టులో స్థానం దక్కలేదు. ఇటీవలే  టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న కార్తీక్.. ఈ టోర్నీలో మొత్తం 22 బాల్స్ ఆడి 14 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో న్యూజిలాండ్, బంగ్లా టూర్లకు ప్రకటించిన టీమిండియాలో కార్తీక్ చోటు కోల్పోయాడు.  ప్రస్తుతం కార్తీక్‌ వయసు 37 ఏళ్లు కాగా.. వచ్చే వరల్డ్ కప్ లో  ఆడే ఛాన్స్ తక్కువ. ఈ క్రమంలోనే రిటైర్మెంట్ సంకేతాలు ఇచ్చాడని భావిస్తున్నారు.