
న్యూఢిల్లీ : యోగర్ట్ బ్రాండ్ ఎపిగామియా తయారీదారు డ్రమ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బాలీవుడ్ నటి దీపికా పదుకొనెపెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడులను కొత్త ప్రొడక్ట్‌లను లాంచ్ చేయడానికి, కొత్త నగరాల్లోకి విస్తరించడానికి వాడతామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 2015 జూన్‌లో లాంచ్ అయిన ఎపిగామియా పలు ఫ్లేవర్లతో యోగర్ట్‌లను అమ్ముతోంది. 10వేల టచ్ పాయింట్లలో యోగర్ట్ బ్రాండ్ రిటైల్ అవుతుంది. ఈ సంఖ్యను కొన్నేళ్లలో 50వేల అవుట్‌లెట్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
‘పార్టనర్‌గా, షేర్‌హోల్డర్‌గా ఎపిగామియా ఫ్యామిలోకి దీపికాను చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఆరోగ్య స్పృహ ఉన్న యువతను చేరుకోవడానికి దీపికా చేస్తోన్న సాయం బ్రాండ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడానికి దోహదం చేస్తుంది’ అని ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు రోహన్ మీర్చందానీ చెప్పారు. ఈ డీల్‌లో భాగంగా డ్రమ్ ఫుడ్స్‌లో పదుకోనె ఈక్విటీని పొందుతారు. అయితే ఆమె పెట్టుబడులు, షేర్ వివరాలను ఇవ్వడానికి కంపెనీ నిరాకరించింది.
‘ఎపిగామియా ఫ్యామిలీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. కేవలం నేను ప్రొడక్ట్‌లను మాత్రమే ఇష్టపడటం లేదు. బ్రాండ్ ఫిలాసఫీకి కూడా ఎక్కువగా కనెక్ట్ అయ్యా. బ్రాండ్ విస్తరణకు టీమ్ వద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. కొత్త ప్రొడక్ట్‌లను లాంచ్ చేయడంలోనూ, కొత్త నగరాల్లోకి ప్రవేశించడంలోనూ చాలా దగ్గరుండి మరీ పాల్గొంటా’ అని దీపికా పదుకొనె అన్నారు.
పలు రంగాల్లో ఇప్పటికే సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వారిలో కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. బాలీవుడ్ నటుడు, నిర్మాత సునిల్ శెట్టి పుణేకు చెందిన ఫిట్‌నెస్, న్యూట్రిషియన్ స్టార్టప్ స్క్వాట్స్‌లో పెట్టుబడులు పెట్టారు. అమితాబ్ బచ్చన్ లోకల్ సెర్చ్ సర్వీస్ ప్లాట్‌ఫామ్ జస్ట్ డయల్ లిమిటెడ్‌లో, ప్రియాంక చోప్రా నెట్‌వర్కింగ్, డేటింగ్ యాప్ బంబుల్‌లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పటి వరకు 32 మంది సెలబ్రిటీలు 67 స్టార్టప్‌లు, ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు.