అక్రమాలకు సీఎంఓ నుంచే డైరెక్షన్స్

అక్రమాలకు సీఎంఓ నుంచే డైరెక్షన్స్

జనగామ, వెలుగు:  ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న టీచర్ల బదిలీల్లో మంత్రులకు కోటా పెట్టారా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రతి మంత్రికి ఐదు నుంచి పది మంది టీచర్లను చోటుకు బదిలీ చేయించే చాన్స్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎంఓకు సిఫార్సు లెటర్లు పెరిగిపోతున్నాయి. ఏడేండ్లుగా టీచర్ల బదిలీలపై ఉన్న బ్యాన్​ ఎత్తేయడంతో పైరవీకారులు రెచ్చిపోతున్నారు. తమ పలుకుబడితో అనుకున్న చోటికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. నేరుగా సీఎంఓ నుంచే విద్యాశాఖకు ఆదేశాలు అందుతున్నట్లు సమాచారం. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పై నుంచి ఆదేశాలు వస్తుండడంతో డీఈఓలు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. ఫలితంగా అర్హత గల టీచర్లు అన్యాయానికి గురవుతున్నారు. మంత్రులకు ఇచ్చినట్లే తమకూ కోటా కల్పించాలని ఎమ్మెల్యేలు అడుగుతున్నట్లు చర్చ నడుస్తోంది.

ఏడేండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే..

2015 తర్వాత మళ్లీ ఇప్పుడు ఒకేసారి ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ షురూ కావడంతో అర్హులైన టీచర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల స్కూళ్లు ఉండగా దాదాపుగా లక్షా 4 వేల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 50 వేల మంది వరకు బదిలీ కానున్నట్లు విద్యాశాఖ అధికారుల అంచనా. ఇందులో తప్పనిసరి బదిలీ కింద సుమారు 25 వేల మంది ఉన్నారు. అలాగే ఒకే స్కూల్​లో 8 ఏండ్ల సర్వీసు పూర్తిచేసిన వారు, ఐదేండ్ల పైబడి సర్వీసు ఉన్న వారు, ఒకేచోట రెండేండ్లు పనిచేసిన వారికి కూడా అప్లై చేసుకునే చాన్స్​ఉంది. గతనెల 27న మొదలైన బదిలీల ప్రక్రియ మార్చి 4 వరకు కొనసాగనుంది. ఈ నెల 14 వరకు హెచ్ఎంలు బదిలీలు జరుగుతాయి. ఆ తర్వాత ఖాళీగా ఉన్న హెచ్ఎం పోస్టుల వేకెన్సీ లిస్ట్​రిలీజ్​అవుతుంది. ఎస్ఏలకు ప్రమోషన్​ఇచ్చి ఖాళీలను భర్తీ చేస్తారు. ఆ వెంటనే సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్​జీటీ)ల బదిలీలు జరుగుతోంది. సుమారు 9,700  మంది టీచర్లకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా. ఈ క్రమంలో జరుగుతున్న పైరవీలతో అర్హులైన టీచర్లు ఆందోళన చెందుతున్నారు. 

దొడ్డి దారిన ఆర్డర్లు

పైరవీకారులు తమకున్న పలుకుబడితో సీఎంఓ నుంచి విద్యాశాఖకు సిఫార్సులు చేయించుకుని ట్రాన్స్​ఫర్​ఆర్డర్ కాపీలను తెప్పించుకుంటూ.. అదే రోజున జాయిన్ అవుతున్నారు. కనీసం అప్లికేషన్ల స్వీకరణ గడువు పూర్తికాక ముందే అనుకున్న చోటుకు ట్రాన్స్​ఫర్ అవడం వివాదాస్పదంగా మారింది. జనగామ జిల్లాలో పనిచేసే నలుగురు టీచర్లు ట్రాన్స్​ఫర్​ఆర్డర్లు తెప్పించుకుని అనుకున్నచోట జాయిన్​అయ్యారు. జనగామ, బచ్చన్నపేట, కొడకండ్ల మండలాల పరిధిలో ఈ బదిలీలు జరిగాయి. వాస్తవంగా అయితే వీరి బదిలీలు మార్చి 4న ఫైనల్ కావాలి. కానీ ఇప్పటికే వారు కోరుకున్న చోటుకు వెళ్లి పోవడంపై తోటి టీచర్లు మండి పడుతున్నారు. సెలెక్ట్​ చేసుకున్న స్కూల్​లో వేకెన్సీ చూపించకుండా సదరు టీచర్లు మేనేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కచోటే కాదు ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

‘అర్థం చేసుకోండి అంటూ’

పైరవీల విషయమై హైదరాబాద్​లోని విద్యాశాఖ కీలక అధికారిని ఉపాధ్యాయ సంఘాలు కలిసి మాట్లాడగా ‘సీఎంఓ నుంచి సిఫార్సులు ఉన్నాయి. అర్థం చేసుకోండి’ అంటూ ఆఫ్​ద రికార్డ్ చెప్పి పంపినట్లు తెలిసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో13 మంది టీచర్లు సీఎంఓ నుంచి ఆర్డర్​కాపీలు తెప్పించుకుని మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు బదిలీ అయ్యారు. ఇతర జిల్లాల నుంచి ఇద్దరు నాగర్ కర్నూలు జిల్లాలో జాయిన్​ అయ్యారు. ఖమ్మం జిల్లాలో నలుగురు టీచర్లు ఇప్పటికే బదిలీ అయ్యారు. ఓ టీచర్​ మానకొండూరు నుంచి సూర్యాపేట మండలంలోని కేసారం ప్రాథమిక పాఠశాలకు ఎస్​జీటీగా ట్రాన్స్​ఫర్ అయ్యారు. సిద్దిపేట జిల్లాలో నలుగురు టీచర్లు బదిలీ అయ్యారు. 

మెదక్​ జిల్లా టేకమల్ మండలం నుంచి నంగునూరు మండలం కొండంరాజుపల్లి స్కూల్​కు ఎస్​జీటీ ట్రాన్స్​ఫర్​అయ్యారు. మద్దూరు మండలం అర్జునపట్ల హై స్కూల్​ కు చెందిన ఒకరు, దూల్మిట్ట మండల కేంద్రంలోని హైస్కూల్​టీచర్​, ఇదే మండలం జాలపల్లి హై స్కూల్​ కు చెందిన మరో టీచర్​ ట్రాన్స్ ఫర్ అయ్యారు. మెదక్​ జిల్లా బ్రహ్మణపల్లి నుంచి సంగారెడ్డి జిల్లా జెన్నారం మండలం మాదారం హై స్కూల్​హెచ్​ఎంగా ఓ లేడీ టీచర్​మూడు రోజుల క్రితం బదిలీ అయ్యారు. మహబూబ్​ నగర్​ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా లింగంపల్లి(బీహెచ్ఈఎల్) ప్రైమరీ స్కూల్​ కు ఎస్జీటీ బదిలీపై వచ్చి విధుల్లో చేరారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందని, అక్రమ బదిలీలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి.

అక్రమ బదిలీలను రద్దు చేయాలి

టీచర్ల అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలి. బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న టైంలో కొందరిని నేరుగా ట్రాన్స్​ఫర్​ చేయడం కరెక్ట్ ​కాదు. జనగామ జిల్లాలో నలుగురు టీచర్లను రూల్స్ కు విరుద్ధంగా బదిలీ చేశారు. ఇలాంటి వారితో దూరప్రాంతాల్లో ఉన్న అర్హులకు అన్యాయం జరుగుతోంది. అవకతవకలపై ఉన్నతాధికారులు స్పందించాలి. అక్రమ బదిలీలను ఆపకుంటే ఆందోళనకు దిగుతం.

– డి.శ్రీనివాస్, టీపీటీఎఫ్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు