శానా యేండ్లు యాదుండేలా భగవంత్ కేసరి : అనిల్ రావిపూడి

శానా యేండ్లు యాదుండేలా భగవంత్ కేసరి : అనిల్ రావిపూడి

ఆరు సినిమాలతో ఒక ఓవర్ పూర్తిచేసి, ‘భగవంత్ కేసరి’ చిత్రంతో సరికొత్త ఓవర్‌‌‌‌ను,‌‌‌‌ కొత్త ఇన్నింగ్స్‌‌‌‌ను స్టార్ట్‌‌‌‌ చేశానంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బాలకృష్ణ హీరోగా కాజల్, శ్రీలీల కీలక పాత్రల్లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు.  

‘‘ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే నాకు.. కంప్లీట్ హానెస్ట్ ఇంటెన్స్ డ్రామాతో ఓ సినిమా చేయాలనిపించింది. దానికి బాలకృష్ణ గారి రూపంలో  సరైన ఆయుధం దొరికింది. మంచి స్టార్ కాస్టింగ్‌‌‌‌తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్, కథ అన్నీ అద్భుతంగా కుదిరాయి. టీజర్‌‌‌‌‌‌‌‌లో చెప్పినట్టు ‘భగవంత్ కేసరి’ పేరు శానా యేండ్లు యాదుంటది.  మంచి కథతో ప్రయోగం చేయాలనుకుంటే బాలకృష్ణ గారు ముందుంటారు.

ఆదిత్య 369, భైరవద్వీపం సహా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి ఘన విజయాలు సాధించారు. ఈ కాన్సెప్ట్‌‌‌‌ను కూడా ఆయన బలంగా నమ్మారు.  స్టార్ హీరోగా ఉండి,  శ్రీలీల లాంటి అప్ కమింగ్, ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్‌‌‌‌కు ఫాదర్‌‌‌‌‌‌‌‌గా నటించిన ఆయన గట్స్‌‌‌‌కు నిజంగా హ్యాట్సాఫ్. షూటింగ్‌‌‌‌లో ఆయన ఇచ్చిన సపోర్ట్, కంఫర్ట్‌‌‌‌తో నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది.  ఇందులో బాలకృష్ణ గారు తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతారు. ఈ యాసలో ఒక ముక్కుసూటి తనం ఉంటుంది. ఆయన వ్యక్తిత్వం దానికి దగ్గరగా ఉంటుంది.

డైలాగ్స్ ఆయన నేచర్‌‌‌‌‌‌‌‌కి దగ్గరగా ఉండటంతో అవి థియేటర్స్‌‌‌‌లో పేలుతాయి. మొదట ఈ చిత్రానికి ‘బ్రో ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ పెట్టాలనుకున్నాం.  అయితే బాలయ్య బాబు టైటిల్ అంటే ఒక ఫోర్స్ ఉండాలి. ప్రేక్షకులకు ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా ఉండాలి. అందుకే ‘భగవంత్ కేసరి’ అని ఫిక్స్ చేశాం. దీనికి నేలకొండ అనే పేరు చేర్చి ఎన్ బికేగా  చేయడంతో మరింత ఆకర్షణ వచ్చింది. ‘అమ్మాయిని  సింహంలా పెంచాలి’  అనే సందేశం అంతర్లీనంగా ఇందులో ఉంది. కొంచెం స్ఫూర్తిని ఇచ్చేలా కూడా  ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సులు ఉన్నా..  నా మార్క్ ఫన్ అక్కడక్కడ టచ్ అవుతూనే ఉంటుంది.  బాలకృష్ణ, శ్రీలీల మధ్య వచ్చే ఎమోషన్  డ్రామా హైలైట్‌‌‌‌గా ఉంటుంది.

శ్రీలీల కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇదొక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది.  అలాగే కాజల్‌‌‌‌ కీలక పాత్రలో కనిపించి కథకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అర్జున్ రాంపాల్ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ విలన్‌‌‌‌ పాత్రలో కనిపిస్తారు. తెలుగు నేర్చుకుని మరీ ఆయన డబ్బింగ్ కూడా చెప్పారు.  బాలకృష్ణ గారి గత సినిమాల రిఫరెన్స్‌‌‌‌లు ఇందులో ఉండవు. నేచురల్‌‌‌‌గా వెళుతుంది. సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరికి ‘భగవంత్ కేసరి’ నచ్చుతుంది. మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్‌‌‌‌కి ఇంకా నచ్చుతుంది’’.